Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమి తనకు దక్కకుండా పోతుందని మనస్తాపం
- పురుగులమందు మింగి రైతు ఆత్మహత్య
నవ తెలంగాణ-మిరుదొడ్డి
ధరణి పోర్టల్‌లో దొర్లిన తప్పు కారణంగా ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో జరిగింది. మిరుదొడ్డి గ్రామానికి చెందిన మద్దెల కిష్టయ్య(73) 1452 సర్వే నంబర్లో 7 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి 30 ఏండ్ల కిందట కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా, కొన్ని రోజులుగా ఈ భూమి నాది అంటూ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని పొలంలో ఉన్న వ్యవసాయ బోరును ధ్వంసం చేశారు. 30 ఏండ్ల కిందట సాదా భైనామా ద్వారా కొనుగోలు చేసిన కిష్టయ్య.. ఆ రైతు భూమి కబ్జాలోనే ఉంటూ సాగు చేస్తున్నాడు. రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోలేదు. ఇదే ఆ రైతు పాలిట శాపంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో 30 ఏండ్ల కిందట భూమిని విక్రయించిన వ్యక్తి నుంచి తిరిగి కొందరు విక్రయించారు. మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ వ్యక్తులు ఈ భూమి తమదంటూ దాడికి దిగారు. కేవలం ధరణి పోర్టల్ కారణంగా తన భూమి తనకు దక్కకుండా పోతోందని కిష్టయ్య మనస్తాపానికి గురయ్యాడు. తాను ఎలా బతకాలని, తన కుటుంబాన్ని ఎలా పోషించాలనే బెంగతో ఈ నెల 17న మంగళవారం ఉదయం తన వ్యవసాయ భూమి వద్ద రసాయనిక గుళికలు మింగి అపస్మారక స్థితిలో పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం రాత్రి కిష్టయ్య మృతి చెందాడు. కిష్టయ్య కుమారుడు నర్సింలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.