Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరీంనగర్
కరీంనగర్ 1, 2 డిపోల ఆర్టీసీ అద్దె బస్సులపై పనిచేస్తున్న డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె ఆదివారం రెండవ రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గిట్ల ముకుంద రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రెండవ రోజు సమ్మె కొనసాగుతున్నా ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక అధికారులు, బస్సు ఓనర్లు ఇంతవరకు చర్చలకు పిలువలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంథినిలో నాలుగు రోజు లుగా సమ్మె జరుగుతుందని తెలిపారు. ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు ఏడాది కిందటే జీవో 25 అమలు చేయాల్సి ఉన్నప్పటికీ జీ.ఓ.ప్రకారం కనీస వేతనాలు ఇవ్వకుండా నామమాత్రపు వేతనాలిస్తూ వారి శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. డ్రైవర్లకు కనీసం ప్రమాద బీమా కూడా కల్పించలేకపోవడం బాధాకరమన్నారు. ఒకవైపు పోలీసుల వేధింపులు, మరోవైపు ఓనర్ల వేధింపులతో డ్రైవర్లు తీవ్ర మానసిక ఆందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఓనర్లతో మాట్లాడి డ్రైవర్లు ఇచ్చిన సమ్మె డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి, కార్యదర్శి చెలికాని శ్రీనివాస్, అద్దె బస్సు డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు పులిపాక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పొన్నాల మనోహర్, ఉపాధ్యక్షులు గంగారవేణి సురేష్, కోశాధికారి దుర్షెటి శశికుమార్, సహాయ కార్యదర్శి కామెర చంద్రశేఖర్, కమిటీ సభ్యులు వంద మంది డ్రైవర్లు పాల్గొన్నారు.