Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 సెల్ఫోన్లు, 1 ల్యాప్‌టాప్ అపహరణ
- అప్రమత్తమైన పోలీసులు.. అదుపులో ఇద్దరు, పరారీలో మరొకరు..
- భద్రత కల్పించాలంటూ విద్యార్థినుల ఆందోళన
నవతెలంగాణ-హసన్‌పర్తి
హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని అనంతసాగర్ ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో వరుస దొంగతనాలతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. నాలుగు రోజులుగా ప్రతి రోజూ గర్ల్స్ హాస్టల్లో దొంగతనాలకు పాల్పడు తున్న దొంగలు ఊహించని విధంగా చిక్కారు. కాగా, ఆదివార తెల్లవారు జామునా వారు కాలేజీ హాస్టల్లో దొంగతనానికి ప్రవేశించి మూడు సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను అపహరించారు. తిరిగి వెళుతుండగా వాష్‌రూమ్ కోసం వచ్చిన విద్యార్థులు వారిని గమనించి కేకలు వేసారు. దాంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మహిళా వసతి గృహంలోకి చేరుకునే సరికి పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోంచి తప్పించుకొని పారిపోతుండగా వారిలో ఒకరు బావిలో పడిపోయారు. కాగా, దొంగలు పడ్డ విషయాన్ని కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శరత్‌కుమార్ స్థానిక ఇన్స్పెక్టర్ రావుల నరేందర్‌కు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఇన్స్పెక్టర్ ఎస్ఐలు భరత్, క్రైం కానిస్టేబుల్ క్రాంతికుమార్ పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ చేసిన సెల్ఫోన్ల జీపీఎస్ ఆధారంగా దొంగల ఆచూకీని కనుగొని వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారిలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సూర్యాపేటకు చెందిన చరణ్ పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూకగా మరొకరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బావిలో పడిన చరణ్‌తో పాటు మరో మైనర్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న రూ.1.10 లక్షల విలువైన ల్యాప్‌టాప్, 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని పరారీలో ఉన్న మరొక దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ రావుల నరేందర్ తెలిపారు. చోరీ జరిగిన గంటలోపే దొంగలను అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఇన్స్పెక్టర్ రావుల నరేందర్, ఎస్ఐ భరత్, క్రైం కానిస్టేబుల్ క్రాంతికుమార్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను నగర పోలీసు కమిషనర్ సీవీ.రంగనాథ్ అభినందించారు. కాగా, బాత్రూమ్ డోర్స్ పగులగొట్టి దొంగలు హాస్టల్లోకి ప్రవేశించడంతో.. తమకు భద్రత కల్పించాలంటూ కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. మూడు రోజుల వ్యవధిలో 14 ఫోన్స్ అపహరణకు గురైనా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.