Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ సభలో మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ-కరీంనగర్: భాష్యం విజయ సారథి గౌరవార్థం ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో నిర్మించే అమృత వర్షిణి (కళాభారతి) పేరును భాష్యం విజయ సారథి కళా వేదికగా మార్పు చేయనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ కళా వేదిక ముందు భాష్యం కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కరీంనగర్‌లోని యజ్ఞ వరాహ స్వామి దేవస్థానంలో ఆదివారం నిర్వహించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ భాష్యం విజయ సారథి సంస్మరణ సభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్‌తో కలిసి మంత్రి గంగుల పాల్గొని మాట్లాడారు. భాష్యం విజయ సారథి లేరన్న నిజాన్ని తాను, తన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నామని, ఆయనతో తమ కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని తెలిపారు. విజయ సారథితో సమాలోచనలు చేయనిదే తాను ఏ కార్యక్రమం చేపట్టలేదని, ఎన్నికల్లో తన నామినేషన్‌తో సహా ఆయన సలహా మేరకే చేసేవాడినన్నారు. ఎప్పుడు ఆయన గౌరవం తగ్గకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తరపున తనదేనని చెప్పారు. భాష్యం ఉన్నటువంటి వరాహ స్వామి దేవస్థాన మార్గాన్ని భాష్యం విజయ సారథి మార్గంగా పెట్టుకుందామన్నారు. సంస్కృతంలో పద్మశ్రీ అందుకొని గొప్ప స్థాయిలో మన జిల్లాకు కీర్తి ప్రతిష్టలను అందించిన భాష్యం ఆలోచనలు, ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించటానికి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. భాష్యం రాసిన పుస్తకాలు చిరస్థాయిగా ఉండేలా జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. ఆయన సాహిత్యాన్ని బాహ్య ప్రపంచానికి అందించేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.