Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఉపాధ్యాయుల అరెస్ట్
నవతెలంగాణ-బంజారాహిల్స్
జీవో 317 వల్ల 2017 బ్యాచ్ మొత్తం ఇబ్బంది పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ భార్యాభర్తల బదిలీలపై ఉపాధ్యాయులు మరోమారు ఆదివారం రోడ్డెక్కారు. జీవో నంబర్ 317ను సవరించల్సిందేనని డిమాండ్ చేశారు. ఎవరి స్థానిక జిల్లాకు వారిని కేటాయించాలని కోరుతూ ఉపాధ్యాయులు వారి చిన్నారులతో కలిసి ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ట్రాఫిక్ జామ్ కూడా కావడంతో ఉపాధ్యాయ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు, గోషామహల్ మైదానానికి తరలించారు. అక్కడా బాధిత ఉపాధ్యాయులు చిన్నారులతో కలిసి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. జీవో వల్ల పడుతున్న బాధను ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకునేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తే పోలీసులు తమను, తమ పిల్లలని కూడా చూడకుండా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్థానికత చూశారని, కానీ ఇప్పుడెందుకు చూడటం లేదని ప్రశ్నించారు. చీకటి జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై టీచర్ల యూనియన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. భార్య భర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా బదిలీలు చేపట్టాలని కోరారు.
శ్రీదేవసేన క్షమాపణ చెప్పాల్సిందే : ఎస్టీయూటీఎస్
పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన మహిళా జాతిని కించపరిచేలా ఉపాధ్యాయులనుద్దేశించిన చేసిన వ్యాఖ్యలను ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు తీవ్రంగా ఖండించారు. ఆమె ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు చేయాలంటూ భార్యాభర్తలను ఒకచోటకు చేర్చాలంటూ ఉద్యమించడమే వారు చేసిన నేరమా?అని ప్రశ్నించారు. మహిళా ఉపాధ్యాయుల పట్ల ఒక మహిళా అధికారి ఇలా మాట్లాడ్డం విద్యాశాఖకే అవమానకరమని విమర్శించారు.
ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులకు టీపీటీఎఫ్ ఖండన
రాష్ట్రంలో 317 జీఓ వల్ల స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులు సొంతజిల్లాకు బదిలీ చేయాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వారిని అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని టీపీటీఎఫ్ ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్‌కుమార్, ముత్యాల రవీందర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వారి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
టీచర్ల అరెస్టు దుర్మార్గం
భార్యాభర్తలం ఒకేచోట పనిచేస్తాం. బదిలీలు చేయండి అని అడిగిన టీచర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు అన్నారు. ఈ మేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆందోళనలో పాల్గొన్న మహిళా టీచర్ల నుంచి వారి బిడ్డల్ని వేరు చేసి అరెస్టులు చేయడం మానవీయత అనిపించు కోదని విమర్శించారు. ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప సీఎం కేసీఆర్‌కు మానవ సంబంధాలు, భావోద్వేగాలు పట్టట్లేదని ఆరోపించారు. ప్రజాస్వా మ్యవాదులు స్పందించాలని కోరారు. 317 జీవో సవరణపై ఉద్యోగ, ఉపాధ్యా యుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.