Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ విప్లవకారుడు చేగువేరా స్ఫూర్తితో పోరాటాలు కొనసాగిద్దామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా (ఎన్ సీఎస్ సీ), ఐప్సో సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో క్యూబా సంఘీభావ సభ నునిర్వహించారు. ఈ సభకు ఎన్ సీఎస్ సీ కో ఆర్డినేటర్ డీ.జీ.నర్సింహారావు అధ్యక్షత వహించగా, మరో కో ఆర్డినేటర్ ఎన్.బాలమల్లేశ్ స్వాగతం పలికారు. చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకగా క్యూబాకు సంఘీభావం తెలిపారు. భారత ప్రజలు క్యూబా చేస్తున్న పోరాటానికి మద్ధతుగా నిలబడతారని చెప్పారు.
మనిషిని ప్రేమించేందుకు జాతీయత అడ్డుకాదు
మనిషిని ప్రేమించేందుకు జాతీయత అడ్డుకాదనే విషయాన్ని చేగువేరా జీవితం చూపించిందని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. ఆయన తన అద్భుతమైన, అమోఘమైన పోరాటంతో ప్రపంచానికి గొప్ప వారసత్వాన్ని ఇచ్చారని కొనియాడారు. సామ్రాజ్యవాదులు వెంటాడి చంపితే, ఆయన మరణం తర్వాత ప్రపంచాన్ని మరింతగా ప్రభావితం చేశారని గుర్తుచేశారు. చేగువేరా కలలుగన్న ప్రత్యామ్నాయ, మానవీయ, అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఇండియాలో ఏది ప్రజాస్వామ్యం?
క్యూబాలో ప్రజాస్వామ్యం లేదంటూ విమర్శించే వారు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందో చెప్పాలని డాక్టర్ అలైదా గువేరా పర్యటన జాతీయ కో ఆర్డినేటర్ అరుణ్ కుమార్ ప్రశ్నించారు. క్యూబాలో ఆకలి లేదు. అందరికి ఉచిత విద్య, వైద్యం అందుతున్నది. 2035 వరకు క్యూబా తాను అనుసరించాలనుకుంటున్న ఆర్థిక విధానాలపై అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించి పరిగణనలోకి తీసుకున్నది. ఆందోళనలు కొనసాగితే క్యూబా అధ్యక్షుడు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి నచ్చజెప్పేంత ప్రజాస్వామ్యం అక్కడ ఉందని తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాది కాలం పోరాటాలు చేసినా... భారతదేశంలోని పాలకులు వారి దగ్గరికి రాలేదని గుర్తుచేశారు.
దేశాలపై దాడి సరికాదు
ఏ దేశమైనా సరే...మరో దేశంపై దాడి చేయడం సరికాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి తెలిపారు. అమెరికా క్యూబాపై దాడి చేయడమైనా..రష్యా, ఉక్రెయిన్పై దాడి చేయడమేనైనా తప్పేనని అభిప్రాయపడ్డారు. తాను ఆశించిన సమాజం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన చేగువేరా నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటారన్నారు. కరోనా కష్టకాలంలో క్యూబా అన్ని దేశాలకు సహాయం చేసిందనీ, మనం విద్య, వైద్యం ఉచితంగా అందించడంలో విఫలమయ్యామని తెలిపారు.
కమ్యూనిజం అణచివేయడం ఎవరి తరమూ కాదు...
కమ్యూనిజం అనే భావనను అణచివేయడం ఎవరి తరమూ కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. మనిషిలోని భావన నుంచి భాష, భాష నుంచి నాదం, నాదం నుంచి నినాదం, దాన్నుంచి వచ్చే భావనతో కమ్యూనిస్టు పోరాటం చేస్తాడని తెలిపారు. చేగువేరా స్పూర్తితో మన దేశంలో ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఆ పదాలను తొలగించేందుకు కుట్రలు
రాజ్యాంగంలోని సోషలిజం, సెక్యులరిజం పదాలను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు పన్నుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్ విమర్శించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వాటిని పూర్తిగా తొలగించే ప్రమాదముందని హెచ్చరించారు.
మరణానికి, ఓటమికి నిరాకరణ
మరణాన్ని నిరాకరించిన గొప్ప విప్లవకారుడు చేగువేరా అని ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అమెరికా సామ్రాజ్యవాదం చేతిలో ఓడిపోవడానికి నిరాకరిస్తూ క్యూబా నిలదొక్కుకుంటున్నదని తెలిపారు. క్యూబా తన అస్థిత్వాన్ని కాపాడుకుంటూ, ఉనికి, స్వాతంత్య్రంగా మనుగడ సాగించేందుకు కాస్ట్రో లాంటి నాయకులు పోరాడారని తెలిపారు. మన పాలకులు ప్రజల పట్ల పీడకులుగా, అగ్రరాజ్యాల దాసులుగా మారారని విమర్శించారు. క్యూబా పోరాటం ఆత్మగౌరవానికి ప్రతీక అని అభివర్ణించారు.
ప్రాణాలు నిలిపే మందులపైనా ఆంక్షలే...
క్యూబా పట్ల అమెరికా విధిస్తున్న ఆంక్షలు అత్యంత దుర్మార్గంగా ఉంటున్నాయని ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కె.యాదవరెడ్డి విమర్శించారు. అమెరికా ఆంక్షల కారణంగా ఎనిమిది నెలల పసిపాప మందులను సకాలంలో తీసుకోలేక చనిపోయిందని తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్కు సంబంధించి వ్యాధి తీవ్రతను తగ్గించే మందులు క్యూబా కనిపెట్టినా వాటిని ఇతర దేశాల ప్రజల ప్రాణాలను నిలబెట్టేందుకు ఉపయోగించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చే గువేరా మనువరాలు ప్రొఫెసర్ ఎస్తేఫానియా గువేరా, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, రచయిత సుద్దాల అశోక్ తేజ, అరుణోదయ విమల, ప్రజాపక్షం దినపత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్ రెడ్డి, సాక్షి ఎడిటర్ వి.మురళి, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.జీ.ఆర్.వినోద్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆప్ నాయకులు డి.సుధాకర్, సీపీఐ (ఎం-ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శివర్గ సభ్యులు జె.వి.చలపతిరావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శివర్గ సభ్యులు ప్రసాద్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్ రావు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేష్, ఎస్ యూసీఐ (సి) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, ఆర్ఎస్ పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి, ఐప్సో నాయకులు తిప్పర్తి యాదయ్య, ప్రముఖ రచయిత శివారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాం నాయక్, ఐప్సో నాయకులు కేవీఎల్, అన్మేష్, కాచం సత్యనారాయణ, ఏఐఐఇఏ మాజీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
సంఘీభావ తీర్మాణం
సభలో క్యూబాకు సంఘీభావం తెలుపుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీర్మాణం ప్రవేశ పెట్టారు.
'క్యూబాపై విధించిన చట్ట విరుద్ధమైన, అన్యాయమైన ఆర్థిక దిగ్భంధనానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబాకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మా దృఢమైన సంఘీభావాన్ని తెలుపుతున్నాం' అని ఆయన పేర్కొన్నారు.