Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ హక్కుల్ని కాలరాస్తే ఉద్యమమే..
- ఆదివాసీ,అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలోని అడవులను కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వ చూస్తున్నదనీ, అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తే ఉద్యమం తప్పదని ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నేతలు హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో మాజీ ఎంపీ, ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ డాక్టర్ మిడియం బాబురావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయ కమిటీ కన్వీనర్ వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ దేశంలోని అడవులను కార్పొరేట్లకు ధారాదత్తంచేస్తూ,అటవీ హక్కులను కాలరాస్తూ,మోడీ ప్రభుత్వం తెచ్చిన అటవీ సంరక్షణ నియమాలు-2022ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం అమలు ఎండమావిగా మారిందని ఆరోపించారు. ఎనిమిదేండ్లుగా ఈ చట్టాన్ని అమలు చేయలేదని చెప్పారు. 2021 నవంబర్,డిసెంబర్ నెలలో అర్జీలు తీసుకుని ఏడాది గడిచినా వాటి పరిశీలన నేటికీ ఎందుకు పూర్తికాలేదో చెప్పాలన్నారు. పైగా చట్టాన్ని వక్రీకరించి ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రాతిపదికగా అర్జీలు తిరస్కరించడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. మిడియం బాబూరావు మాట్లాడుతూ అటవీ సంరక్షణ నియమాలు-2022 అటవీ హక్కుల చట్టాన్ని, నియమాలను,ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు. వాటి అమలును ఆపాలని కోరుతూ 26-9-2022న జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్, కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసిందని తెలిపారు. దీనికి జవాబుగా రాసిన వివరణలు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ లేవనెత్తిన అటవీ హక్కుల చట్టం ఉల్లంఘనలను దాటవేస్తూ, అటవీ సంరక్షణ నియమాలు-2022 ను గుడ్డిగా , మొండిగా 10-11-2022న సమర్ధించు కోవటాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ల అనుకూల చట్టాలను, విధానాలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సమన్వయ కమిటీ తీర్మానించిందని తెలిపారు.
కార్యాచరణ..
- ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి ఐదు వరకు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలి.
- ఫిబ్రవరి 20న హైదరాబాద్లోని ధర్నా చౌక్ లో మహాధర్నా కార్యక్రమాన్ని ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలి. ప్రతిపక్ష పార్టీలనాయకులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ,ఎంపీలను ఆహ్వానించాలి.
- ఫిబ్రవరి 6, 7 తేదీలలో మండల కేంద్రాల్లో, 13న ఐటీడీఏ, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలి.
- ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రభుత్వం స్పందించకపోతే మార్చి మొదటి వారంలో ఏజెన్సీ సడక్ బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వాలి.
- రాష్ట్రపతి,జాతీయ ట్రైబల్ కమిషన్, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులు, ప్రత్యేకంగా ఆదివాసీ తెగల ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వాలి.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సమన్వయ కమిటీ కన్వీనర్ కెచ్చల రంగారెడ్డి, సీపీఐ(ఎంఎల్)నాయకులు ప్రసాద్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి కోటేశ్వరరావు, మండల వెంకన్న, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, ఏఐకేఎంఎస్ నాయకులు తుపాకుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.