Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యుదయవాదులు, టీచర్లు, నాస్తికులపై దాడులను అరికట్టాలి
- స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారాలు
- దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
అభ్యుదయవాదులు, అంబేద్కర్ వాదులు, టీచర్లు, హేతువాదులు, నాస్తికులపై రాష్ట్రంలో మతోన్మాదుల మూకదాడులపై ఆగ్రహం పెల్లుబికింది. దుండగులను కఠినంగా శిక్షించాలని, బాధితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని ఎత్తివేయాలనీ, జైల్లో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్వేచ్ఛ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఐబి వద్ద సీపీఐ(ఎం), సామాజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.జయరాజు, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.మాణిక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజయ్య, డీబీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి తదితరులు మాట్లాడారు. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు దానిని కాపాడుకోవడం పౌరులందరి బాధ్యత అన్నారు.మతోన్మాద మూకల దాడులను ఆరికట్టాలని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు.
అక్రమ అరెస్టులను ఖండిస్తూ భావ ప్రకటన స్వేచ్చ, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో మానవహారంగా ఏర్పడ్డారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్.మహిపాల్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రజాస్వామ్యవాదులపై భౌతికదాడులు, అక్రమ అరెస్టులను ఖండించాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేశం, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మహేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీచర్లు, అంబేద్కర్‌వాదులు, భౌతికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, నాస్తికులు, హేతువాదులపై మతోన్మాద మూకదాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిజామాబాద్‌లో టీచర్ మల్లికార్జున్‌పై ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నాయకులు దాడి చేయడం దారుణమన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ కార్యక్రమం నేపథ్యంలో పలువురు ప్రజా సంఘాల నాయకులను ఉదయాన్నే పోలీసులు అరెస్టు చేశారు.కరీంనగర్ పట్టణంలోని స్థానిక తెలంగాణ చౌక్ వద్ద స్వేచ్ఛ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ మానవహారాన్ని నిర్వహించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీి అధికారంలోకొచ్చాక మతోన్మాదం పెట్రేగిపోతుందన్నారు. మతాలను కించపరిచే వారిపై చట్టప్రకారం శిక్షించాలిగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని భౌతిక దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. కేంద్రంలోని నియంత పాలనను ప్రశ్నిస్తున్న వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.