Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుంతలు పడిన రోడ్డుపై మట్టి పోయడానికీ నిధుల్లేవా..?
- ముషంపల్లి నుంచి నల్లగొండకు డబుల్ రోడ్డు వేయాలి: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్
- ముషంపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర, ధర్నా
నవ తెలంగాణ -నల్లగొండ/నల్లగొండ కలెక్టరేట్
''పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా.. ప్రజల బతుకులు మారడం లేదు.. 15 ఏండ్లుగా ముషంపల్లి రోడ్డు అతుకుల గతుకులుగా మారింది.. ఆ రోడ్డులో ప్రయాణం చేసే ప్రజల ప్రాణం గాలిలో దీపంగా మారింది.. ప్రజా సమస్యలపై పాలకులకు పట్టింపే ఉండటం లేదు'' అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల మయంగా మారిన రోడ్డును డబుల్‌గా మారుస్తూ వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) నల్లగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ముషంపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. వెలుగుపల్లి, అన్నారం, అన్నారెడ్డిగూడెం, రసూల్‌పురం గ్రామాల ప్రజలు సుమారు వెయ్యి మందికిపైగా కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వచ్చారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు గుంతలమయంగా మారడంతో అనేకమంది ప్రమాదాలకు గురై మరణించారని తెలిపారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్అండ్బీ శాఖ వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి డబుల్ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు.
వెలుగుపల్లి నుంచి రసులుపురం, దుప్పలపల్లి రైల్వే ట్రాక్ వరకు డాంబర్ రోడ్డుగా మార్చేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 3న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో అధిక నిధులు కేటా యించి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. రోడ్డు విషయంలో పాలకులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు.
గుంటల్లో మట్టి పోయడానికి కూడా నిధులు లేవని చెప్పటం ఏంటని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ వినరు కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ పాదయాత్రలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, మండల కార్యదర్శి నలపరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.