Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అనాధలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అనాధల హక్కుల పోరాట వేదిక (ఏహెచ్ పీవీ) వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం అనాథలకిచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఏహెచ్పీవీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకటయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, అనాధలకు రాష్ట్ర ప్రభుత్వమే అమ్మ, నాన్న అంటూ కేసీఆర్ హామీ ఇచ్చి ఏడు సంవత్సరాల ఏడు నెలల ఏడు రోజులైన సందర్భంగా ముఖ్యమంత్రి 777 సినిమా చూపిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద గల ధర్నాచౌక్‌లో 30న అరిగోస దీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అనాధల హక్కుల సాధనకు జరిగే పోరాటంలో అందరూ కలిసికట్టుగా కదిలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనాధలకిచ్చిన ఏ హామీని నెరవేర్చలేదనీ, వారిని సీఎం కేసీఆర్ మరిచిపోయారని విమర్శించారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మద్ధతిస్తే అనాధల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో అనాధలకు రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తాననీ నమ్మబలికిన కేసీఆర్ రాష్ట్రంలో ఎక్కడా కట్టలేదని తెలిపారు. కరోనా సమయంలో ఎంతో మంది పిల్లలు అనాధలయ్యారనీ, రెండేండ్లలో అనాధల సంఖ్య పెరిగిందన్నారు. వారి గురించి అధ్యయనం చేసి మరిచిపోవడం సీఎంకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. అనాథలకు గురుకులాలు ఏర్పాటు చేసి బడ్జెట్లో నిధులు కేటాయించాలనీ, సరూర్‌నగర్‌లో అనాధలకు కేజీ టూ పీజీ ఉచిత విద్యనందించాలనీ, ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ, అనాధాశ్రయాలకు ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు. అనాధల కోసం మందకృష్ణ మాదిగ తలపెట్టిన పోరాటానికి ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలు మద్ధతు ప్రకటించాయి.
రాజ్యాన్ని ప్రజాస్వామీకరించాలి
రాజ్యాన్ని ప్రజాస్వామీకరించాలనీ, సమాజాన్ని మానవీకరించలని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. స్వార్థంగా బతకడమే గొప్ప జీవితమనే సిద్ధాంతాలు కూడా వస్తున్న సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న ప్రపంచంలో తాము ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో అనాధల హక్కుల కోసం గొంతెత్తడం చారిత్రక సందర్భమన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో అభివద్ధి కుంటుపడుతుందని భావించే ప్రభుత్వాల విధానాలతో భవిష్యత్తులో అనాధల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. పిల్లలు సంతోషంగా లేని సమాజం బాగుపడదని తెలిపారు.
అనాధల హామీల విస్మరణ అత్యంత దుర్మార్గం
అనేక వర్గాలకిచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించడం దుర్మార్గమైతే, అనాధలకిచ్చిన హామీలు కూడా అమలు చేయకపోవడం అత్యంత దుర్మార్గమని సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ విమర్శించారు. అనాధల కోసం రాష్ట్రలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామనీ, ముందుగా యాదాద్రి నుంచి మొదలు పెడతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. యాదాద్రిలో దేవాలయ నిర్మాణం పూర్తి చేశారే కానీ, పాఠశాల కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలనీ, ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ మాదిరిగా అనాధలకు సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ చేశారు. అనాధలు సమాజంలో అందరితో గౌరవంగా బతికేందుకు వీలుగా అవసరమైన కార్యక్రమాల కోసం నిధులు కేటాయించాలని సూచించారు.
అంతు లేని అత్యాచారాలు
అనాధలపై దాడులు, అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయనీ, అయితే అవి వెలుగులోకి రావడం లేదని ఏహెచ్పీవీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకటయ్య తెలిపారు. కేవలం నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 300కు పైగా దాడులు, అత్యాచారాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనాధల కోసం హాస్టళ్లను 365 రోజులు నడపాలనీ, తాము చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. పండుగలకు సెలవులివ్వొద్దనీ తాము కోరామనీ, సెలవులిస్తే ఇండ్లే లేని వారు ఎక్కడికి వెళతారని ప్రశ్నించారు. వారికి ఇంటర్మీడియట్, డిగ్రీలో సీట్లు కేటాయించాలనీ, మంత్రివర్గ ఉపసంఘం డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ మల్లు రవి, రాములు నాయక్ (కాంగ్రెస్), రావుల చంద్రశేఖర్ రెడ్డి (టీడీపీ), ఏపూరి సోమన్న (వైఎస్సాఆర్టీపీ), ఇందిరా శోభన్ (ఆప్), అంజయ్య నాయక్ (సీపీఐ), సాధినేని వెంకటేశ్వర్ రావు (సీపీఐ-ఎంఎల్ న్యూడెమోక్రసీ), రాజు (ఏహెచ్పీవీ), అద్దంకి దయాకర్ (తెలంగాణ మాల మహానాడు), జాజుల శ్రీనివాస్ గౌడ్ (బీసీ సంక్షేమ సంఘం) నాయకులు కోల జనార్థన్ (జేఏసీ), రాంబాబు (వికలాంగుల హక్కుల పోరాట సమితి) తదితరులు పాల్గొన్నారు.