Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రతాధికారులకు డీజీపీ ఆదేశాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్రంలో మహిళల భద్రతల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదనీ, బాధితులను ఆదుకోవడంలో శీఘ్ర స్పందన అత్యవసరమని పోలీసు అధికారులకు రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షిఖా గోయెల్, డీఐజీ సుమతిలతో డీజీపీ సమావేశమై మహిళల భద్రతల విషయంలో తీసుకుంటున్న చర్యలు, వాటికి వస్తున్న ఫలితాల గురించి ఆయన చర్చించారు. ఏదేనీ మహిళా సమస్యపై పోలీసుల దృష్టికి వచ్చిన వెంటనే వాటికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్ల అధికారు, సిబ్బంది వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం జరిగినా.. పోలీసులపై మహిళల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదమున్నదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని 750 పోలీసు స్టేషన్లలో మహిళా డెస్కులు మంచిగా పని చేస్తున్నాయని ఆయన అభినందించారు. సైబర్‌క్రైమ్ నిరోధంలో, వాట్సప్, ఫేస్‌బుక్‌లలో మహిళలపై జరుగుతున్న వేధింపు చర్యలను అరికట్టడంలో పోలీసులు చాలా వరకు విజయం సాధించారని, ఇలాంటి కేసుల దర్యాప్తులో మరింత పురోగతి అవసరమని డీజీపీ తెలిపారు. షీటీమ్‌ల పనితీరు కూడా బాగా సాగుతున్నదని, ఈవ్‌టీజర్లు మొదలుకొని మహిళలను వేధించేవారిని పట్టుకొని కటకటాల వెనుకకు తరలించడంలో షీటీమ్‌లు నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని ఆయన అన్నారు. గతేడాది ఆరువేలకు పైగా కేసులు షీటీమ్‌లు పరిష్కరించాయనీ, 517 ఎఫ్ఐఆర్ లను నమోదు చేసి, కేసును నమోదు చేస్తున్నారని డీజీపీ తెలిపారు. భరోసా కేంద్రాలకు వస్తున్న మహిళలపై లైంగికదాడి కేసుల్లో గత సంవత్సరం 23 కేసులలో నిందితులకు యావజ్జీవ శిక్షలను పడేలా చేయడంలో భరోసా కేంద్రాలు మంచి ఫలితాలను సాధించాయని ఆయన అన్నారు. మహిళల భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా రాష్ట్ర పోలీసు శాఖ ముందుకు సాగుతున్నదని, ఈ విషయంలో ప్రతి పోలీసూ కీలక పాత్ర వహించాలని, రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆ దిశగా క్రియాశీల పాత్ర వహించాలని ఆయన కోరారు.
రెండ్రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్ నివాసానికి ఆనందరెడ్డి అనే డిప్యూటీ తహశీల్దార్ అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టడం, దానిపై జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఆనందరెడ్డిని అరెస్టు చేయడం వంటి ఘటనల నేపథ్యంలో డీజీపీ మహిళా భద్రతా విభాగం అధికారులతో జరిపిన ప్రత్యేక సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అలాగే, స్మితా సభర్వాల్ నివాసం వద్ద జరిగిన ఘటనకు సంబంధించి కూడా అధికారుల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.