Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బదిలీలు, పదోన్నతుల్లో అవకతవకల్లేకుండా చూడాలి
- కలెక్టర్లకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పాఠశాల విద్యలో అద్భుతమైన మార్పునకు నాంది పలుకుతున్న 'మన ఊరు-మనబడి' కార్యక్రమం మొదటి విడతలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం నుంచి 'మన ఊరు-మనబడి' కార్యక్రమం పురోగతిని మంత్రి సమీక్షించారు. పాఠశాలల స్వరూపం సమూలంగా మార్చి, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా రూపుదిద్దాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల సదుపాయాలను ఏర్పాటు చేయించేలా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శ్రీకారం చుట్టారని వివరించారు. రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలుంటే మొదటి విడతలో 9,123 బడుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.3,497.62 కోట్ల ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వాటిలో 7,479 పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 1,644 పాఠశాలలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని వివరించారు. మొదటి విడతలో చేపట్టిన పాఠశాలలను బాగు చేయడం ద్వారా 14,71,684 మంది విద్యార్థులంటే దాదాపు 63 శాతం మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. శుక్రవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు ప్రకటించే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ఎలాంటి లోపాల్లేకుండా, ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరముందని సూచించారు. ఈ విషయంలో కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.