Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే వద్ద దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెస్‌సీయూ)లో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, నాయకులపై ఏబీవీపీ నాయకులు దాడి చేయడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) వద్ద ఏబీవీపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ హెచ్‌సీయూలో విద్యార్ధి సంఘ ఎన్నికలు శుక్రవారం జరిగాయని తెలిపారు. ఎస్ఎఫ్ఐ ప్యానెల్ ఎన్నికల పోస్టర్లను ఏబీవీపీకి చెందిన రాజేందర్ నాయక్, ఆకాశ్ బాటి, సిద్దం శుక్లా అనే విద్యార్ధులు చింపివేశారని తెలిపారు. ఈ పోస్టర్లను చింపొద్దంటూ వారించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఆకాశ్‌ను మద్యం మత్తులో విచక్షణా రహితంగా ఏబీవీపీ నాయకులు దాడి చేశారని విమర్శించారు. వారే కర్రలు, రాళ్లతో యూనివర్శీటి హాస్టల్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశారని అన్నారు. వారికి వారే అద్దాలను బద్దలు కొట్టుకుని గాయాలు చేసుకుని ఎస్ఎఫ్ఐ దాడి చేసిందంటూ ప్రకటించడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. కరోనా సమయంలో విద్యార్ధులకు హాస్టళ్లు ఇవ్వాలనీ, యూనివర్శీటిలో ఉన్న హాస్టళ్లు, డిపార్ట్మెంట్ సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడిందని గుర్తు చేశారు. అదే రోజు ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై దాడికి ప్రయత్నం చేశారని చెప్పారు. మళ్లీ ఎన్నికల ముందు ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు. యూనివర్శీటీలో శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని ఏబీవీపీ ఉద్రిక్తంగా మార్చుతున్నదని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో విద్యార్థులపై ఏబీవీపీ దాడికి పాల్పడిందన్నారు. హెచ్‌సీయూలోనే కాకుండా గతంలో ఢిల్లీ జెఎన్యూలో, ఎఎంయూలో కూడా కర్రలు, కత్తులతో దాడి చేశారని గుర్తు చేశారు. ఈ దాడిని విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె అశోక్ రెడ్డి, నాయకులు రమేష్, అజరు, వాసు, శివ తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ గూండాలను కఠినంగా శిక్షించాలి : ఏఐఎస్ఎఫ్
హెచ్‌సీయూలో వామపక్ష విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి చేసిన ఏబీవీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘం కూటమి ఎన్నికల్లో గెలుస్తుందనీ, దీన్ని ఓర్వలేక ఏబీవీపీ గూండాలు కర్రలతో దాడి చేసి అరాచకాన్ని సృష్టించారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం కాదనీ, గూండాల సంఘంగా మారిందని విమర్శించారు. తెలంగాణ విద్యార్థి లోకం ఆ సంఘాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దాడి చేసిన వారిని వర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలనీ, పోలీసులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.