Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'అనంతోజు' అధ్యయనం భేష్
- 'ధార' పుస్తకావిష్కరణలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సాహిత్యరంగంలో అనంతోజు మోహనకృష్ణ రచనలు 'ధార'గా మొదలై, సముద్రంగా విస్తరించి, సమాజ చైతన్య గమనానికి దిశానిర్దేశనం చేయాలని పలువురు వక్తలు అభిలషించారు. ఆయనకు సార్వజనీన వ్యాసరచనా స్వభావాన్ని మార్క్సిస్టు సిద్ధాంతమే తెచ్చిపెట్టిందని అభిప్రాయ పడ్డారు. అనంతోజు మోహనకృష్ణ రచించిన 'ధార' సాహిత్య వ్యాసాల పుస్తకావిష్కరణ సభ శనివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమురయ్య హాల్లో జరిగింది. తెలంగాణ సాహితి ఉపాధ్యక్షులు రాంపల్లి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమా నికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య టీ గౌరీశంకర్ ముఖ్య అతిథిగా హాజరై, పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకానికి 'ధార' అనే పేరును నామౌచిత్యంగా పెట్టారనీ, దానిలోని 15 వ్యాసాలు సార్వజనీన సాహిత్యంగా నిలిచేవని అన్నారు. అనేకమంది సాహిత్య నిష్ణాతులకు కూడా తెలియని అంశాలను మోహన కృష్ణ తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చారని అభినందించారు. యువతరం సమాజం గురించి ఆలోచించి, ప్రేరేపింపబడితే ఇలాంటి అధ్భుత రచనలు వస్తాయని చెప్పారు. పుస్తక పరిచయం చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ల గోపాల్ మాట్లాడుతూ సాహిత్య గమనాన్ని గుర్తెరిగి, మరుగున పడిన చరిత్రను వ్యాసరూపంలో అక్షరబద్ధీకరించడం గొప్ప విషయం అని అన్నారు. కవులు, కథకులతో పాటు వ్యాసకర్తలకూ పరిశోధనా దృక్పధం ఉంటుందనీ, దానికి సామ్యవాద మానవతావాదాన్ని జోడించి రచనలు చేస్తే చరిత్రలో చిరస్థాయిగా మిగిలి పోతాయన్నారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ మోహన కృష్ణ రచనల్లో మార్క్సిస్టు సిద్ధాంతం తెచ్చిపెట్టిన ప్రామాణికత, నిబద్ధత కనిపిస్తు న్నాయని చెప్పారు. సమాజంలో చైతన్యాన్ని నింపే ఇరుసు లాంటి వ్యాసాలను ఆయన రాసారని అభినందించారు. ప్రముఖ రచయిత్రి జ్వలిత మాట్లాడుతూ సమాజానికి కావల్సిన ప్రయోజ నాలను ఈ పుస్తకం ద్వారా వెల్లడించారనీ, ఇది విద్యార్థులకు పరిశోధనార్హంగా ఉంటుం దని అభిప్రాయపడ్డారు. ప్రముఖ సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ మాట్లాడుతూ ప్రతిభకంటే సంస్కారం గొప్పదనీ, భాషా విస్తృతికి అదే తొలి మెట్టు అని చెప్పారు. పాత తరం స్ఫూర్తిపొందే పద్ధతిలో నేటి యువతరం రచనలు చేస్తున్నదని కొనియాడారు. నవతెలంగాణ సంపాదకులు ఆర్ సుధాభాస్కర్ మాట్లాడుతూ సాహిత్యం ప్రజల పక్షాన నిలవాలని ఆకాంక్షించారు. మార్క్సి జమే మోహన కృష్ణ రచనలను ప్రేర ణగా నిలుస్తుందన్నారు. అదానీల కోసం పాకులాడ టమో... వారేదో చేస్తారని బెదిరిపోయేతత్వం మార్క్సిజానికి లేదని స్పష్టంచేశారు.
తెలం గాణ సాహితి ప్రధాన కార్యదర్శి కే ఆనందా చారి మాట్లాడుతూ పత్రికారంగం సాహిత్య కారులకు అద్భుత వేదిక అని చెప్పారు. ప్రజాపక్షాన నిలిచే ఉద్యమాల స్ఫూర్తి నుంచి వచ్చే అక్షరాలే చరిత్రగా నిలుస్తాయని తేల్చిచెప్పారు. తెలుగు అధ్యాపకులు డాక్టర్ బీ జయరావు, బోడేపూడి విజ్ఞాన కేంద్రం పూర్వ జనరల్ మేనేజర్ సీహెచ్ రాజారావు రచయిత మోహనకృష్ణకు శుభాశీస్సులు అంద చేశారు. కార్యక్రమాన్ని పేర్ల రాము సమన్వయం చేశారు.