Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 181 ఉన్నత బడులు.. 7671 మంది స్టూడెంట్స్
- 34 రోజులకు.. రూ.3.91కోట్లు ఖాతాల్లో జమ
- పండ్లు, ఇతర తినుబండరాల వెండర్ల కోసం వెతుకులాట
నవతెలంగాణ-సిటీబ్యూరో
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా.. సర్కారు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా.. ఆ సమయంలో విద్యార్థులకు అందించాల్సిన స్నాక్స్ పని ప్రధానోపాధ్యాయులపై పడింది. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం రెండు సార్లు స్నాక్స్ అందించేందుకు విద్యాశాఖ ఈ నెల 10వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా హైదరాబాద్ జిల్లాలో 7,671 మందికి లబ్ది చేకూరనుంది. అయితే, ఈ స్నాక్స్ మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారానే అందించాలని ఆదేశాలున్నాయి. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మన్నా ట్రస్ట్ ద్వారా పెడుతున్నారు. అయితే, స్నాక్స్ కూడా ట్రస్ట్ ద్వారా అందించడం సాధ్యం కాదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆ బాధ్యతను ఆయా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులకే అప్పగించారు. అధికారుల ఆదేశాల మేరకు పండ్లు, ఇతర తినుబండారాల తయారీ వెండర్ల కోసం వెతుకతులాట ప్రారంభించారు.
రెండు గంటలు ప్రత్యేక తరగతులు
విద్యార్థులు టెన్త్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ఉదయం గంట, సాయంత్రం ఓ గంట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళ స్పెషల్ క్లాసులు కొనసాగనున్నాయి. ఈ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ఉదయం, సాయంత్రం వేళ్లలో స్నాక్స్ ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది. పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు సెలవు రోజులు మినహా పాఠశాలలు పనిచేసే మొత్తం 34 రోజులపాటు స్నాక్స్ అందిస్తారు. ఒక్కో విద్యార్థికి ప్రతిరోజూ రూ.15 తినుబండారాలు అందజేస్తారు. జిల్లాలో మొత్తం 181 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా.. 7,671మంది పదో తరగతి విద్యనభ్యసిస్తున్నారు. వీరికి స్నాక్స్ అందించేందుకు ప్రభుత్వం రోజుకు రూ.1,15065 చొప్పున 34 రోజులకుగాను రూ.3,91,2,210 కోట్లు కేటాయించింది. కాగా ఇప్పటికే డీఈవో ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులకు కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దాతల సహకారం తీసుకొని స్నాక్స్ అందిస్తున్నారు. కాగా, ప్రభుత్వమే ఈసారి స్నాక్స్‌కు నిధులు కేటాయించడంతో విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూరడంతోపాటు, ప్రధానోపాధ్యాయులు దాతల సహకారం కోరే అవసరం తప్పింది.
విద్యార్థుల ఆర్యోగాన్ని దృష్టిలో పెట్టుకోనే..
హైదరాబాద్‌లో మొత్తం 691 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,17,502 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యా హ్న భోజనాన్ని మన్నా ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారు. సదరు ట్రస్ట్ వారు ఉదయం 6 గంటలకే అన్న, కూర, సాంబారు వంటి పదార్థాలు తయారు చేసి.. ఉదయం 11గంటల వర కు అన్ని పాఠశాలలకు ప్రత్యేక వాహనాల ద్వారా పంపి స్తారు. అలా పంపిన భోజనాన్ని మధ్యాహ్నం ఒంటిగంటకు విద్యార్థులకు పెడుతారు. అయితే, ఉదయం 6గంటలకు తయారు చేసే తినుబండారాలు సాయంత్రంలోగా పాచిపోయే అవకాశం ఉన్నందున విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడనుంది. దాంతో పది విద్యార్థులకు స్నాక్స్ అందించే బాధ్యతను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యా యులకే అప్పగించారు. సంబంధిత నిధులు కూడా ఇప్పటికే పీఎఫ్ఎంఎస్ ఖాతాల్లో జమచేశారు. మరోవైపు హెడ్మాస్ట ర్లు పాఠశాలకు సంబంధించిన రోజువారి పనులతోపాటు పది విద్యార్థుల ప్రిపరేషన్, ప్రత్యేక తరగతులకు సంబం ధించిన ఫొటోలు అప్లోడ్ వంటి పనులతోనే భారమ వుతుంటే.. ఇప్పుడు స్నాక్స్ కొనుగోలు బాధ్యత ఎలా అంటూ వాపోతున్నారు. ఇంకోవైపు పీఎఫ్ఎంఎస్ ఖాతాల్లో వేసిన నిధులు, వాటి ఖర్చులకు సంబంధించి ప్రతి బిల్లుకూ జీఎస్టీ కావాలి. ప్రతి బిల్లునూ జీఎస్టీతోపాటు అప్లోడ్ చేయాల్సి ఉండటం మరింత ఇబ్బందికరంగా మారుతోంది.
ఉదయం తయారు చేసి సాయంత్రం పెట్టలేం..
ఆర్.రోహిణి- డీఈవో- హైదరాబాద్
నగరంలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మన్నా ట్రస్ట్ ద్వారా అందిస్తున్నాం. వారు ఉదయమే తయారు చేసి.. ఆ సమయంలోగా పంపిస్తారు. అలాంటప్పుడు ఉడకబెట్టిన పల్లీలు, ఇతర తినుబండారాలు వంటివి ఎప్పుడో ఉదయం చేయించి.. సాయంత్రం పెడితే.. విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉన్నది. అందుకని ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకే పోషకహారాలతో కూడిన స్నాక్స్ విద్యార్థులకు అందించాలని సూచించాం. నిధులు జమ చేశాం.