Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరణించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి
- ప్రకటించిన నిమ్స్ వైద్యులు
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి పోరాడి ఓడింది. ఐదు రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. కాకతీయ వైద్యకళాశాలలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రీతిని సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ కొన్నాళ్లుగా వేధిస్తుండటంతో తాళలేక ఆమె హానికరమైన ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి.. తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్యుల బృందం విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఆమె భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నిమ్స్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి భారీ పోలీసు బందోబస్తు మధ్య తరలించేందుకు ప్రయత్నించగా ప్రీతి బంధువులు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, అక్కడే ఆందోళనలకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రాత్రి 12 గంటలు దాటాక కూడా ప్రీతి మృతదేహాన్ని గాంధీకి తరలించేందుకు అంగీకరించలేదు. రెండు సార్లు అంబులెన్స్‌లోకి ఎక్కించి, ఆందోళనల నేపథ్యంలో తిరిగి ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. ఆందోళనకారులు అంబులెన్స్ తాళాలు లాక్కోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనితో పోలీసులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు మంత్రి టీ హరీశ్‌రావుతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రీతి మరణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో సమగ్ర విచారణ జరిపించాలనీ, నిమ్స్ ఆస్పత్రిలో ఆమెకు చేసిన వైద్యంపై కేస్ షీట్‌ను కుటుంబసభ్యులకు ఇవ్వాలనీ, ఎంజీఎం ఆస్పత్రి ప్రిన్సిపాల్, హెచ్ఓడీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, నిమ్స్ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. మరో వైపు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి, కాకతీయ మెడికల్ కాలేజీ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రీతి ఘటనకు కారకుడైన సైఫ్‌ను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడకొండ్ల మండలం గిర్నితండాలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్‌వోడీలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అత్యంత బాధాకరం..
ప్రీతి మరణం పట్ల హరీశ్ రావు సంతాపం
డాక్టర్ ప్రీతి మరణం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించిందని తెలిపారు. పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం... మనసును తీవ్రంగా కలిచి వేసిందని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. హరీశ్ రావుతో పాటు పలువురు మంత్రులు సంతాపాన్ని తెలిపారు. అంతకు ముందు నిమ్స్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రీతి రాత్రి 9.10 గంటలకు మరణించినట్టు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ప్రీతి కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా: మంత్రి ఎర్రబెల్లి
నిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసిన కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రకటన చేస్తున్నట్టు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
ప్రీతి మతి పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన, విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ''ప్రీతి ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ఎవరూ పూడ్చలేని ద్ణుఖంలో ఆ కుటుంబం ఉంది. ప్రీతి ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తేలిన దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. ప్రీతి ఆత్మశాంతించాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నా'' అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.