Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరీంనగర్ సిగలో మానేరు రివర్ ఫ్రంట్కురూ.410కోట్లతో మెరుగులు
- ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫౌంటెన్.. భారీ పర్యాటక ప్రాజెక్టు దిశగా అడుగులు
- బాల్ ఆన్ వాల్ ఫౌంటెన్ కాన్సెప్ట్‌తో భారీ ప్రదర్శనకు నిర్మాణాలు
- తీగల వంతెన నిర్మాణం పూర్తి, వాగులో పూర్తిదశలో రిటైనింగ్ వాల్స్
- కేబుల్ బ్రిడ్జిపై ఎల్ఈడీ తెరలపై యాడ్లు, పథకాల ప్రచారం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్లో సిగలో మానేరు రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఓ మణిహారంగా మారనుంది. రూ.410కోట్లతో చేపడుతున్న ఈ పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఇన్స్టాల్ చేయబోయే ఫౌంటెన్ ప్రపంచంలోనే మూడో అతి పెద్దది కావడం విశేషం. మొదటిది దక్షిణ కొరియాలోని సియోల్‌లో, రెండోది చైనాలోని షాంఘైలో ఉండగా.. మూడోది కరీంనగర్‌లోనే కావడం గమనార్హం. ఇప్పటికే నీటి పారుదల శాఖ నుంచి రూ.310కోట్లు, పర్యాటకశాఖ నుంచి రూ.100కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.70కోట్ల వరకు ఫౌంటెన్ నిర్మాణానికే వెచ్చిస్తున్నారు. ఆదివారం స్థానిక మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ కూడా చేశారు. ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జి, దాని అప్రోచ్ రోడ్డు పూర్తి కాగా.. వాగులో ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ చివరి దశకు చేరుకున్నాయి. ప్రతిరోజూ 50కిపైగా యంత్రాలతో పనులు సాగుతుండగా.. మరో ఏడాదిలో మానేరు రివర్‌ఫ్రంట్ అందుబాటులోకి రానుంది. ఐదేండ్ల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ దిగువ మానేరు జలాశయం చెంతన సుందరమైన పర్యాటక ప్రాంతాన్ని ఆహ్మదాబాద్‌లోని సబర్మతి తరహాలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు నీటిపారుదల, పర్యాటక శాఖలను సమన్వయపరుస్తూ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఎల్ఎండీ గేట్ల నుంచి దిగువకు ఉన్న నీటి ప్రవాహానికి ఇరువైపులా 10కిలోమీటర్ల మేర భారీ ప్రహరీలు నిర్మించారు. నీటి మట్టం నుంచి రెండు దిక్కులా 4.8 మీటర్ల ఎత్తులో పాదచారులు నడిచేందుకు.. పర్యాటకులు కూర్చుని వీక్షించేందుకు బెంచీలు ఏర్పాటు చేస్తారు. అలుగునూర్ వంతెన నుంచి తీగల వంతెన దాటిన కొద్దిదూరం వరకు 2.3 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే రిటైనింగ్ వాల్ నిర్మాణంతోపాటు ఇరువైపులా పెద్దఎత్తున చదును చేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ.410 కోట్లు కాగా, మొదటి దశలో రూ.308 కోట్లతో పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం సగం మేర 210 మీటర్ల దూరం బ్యారేజీ.. దానికి ఆనుకుని 190 మీటర్ల గోడతో కూడిన చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. వాగుకు ఇరువైపులా పలుచోట్ల నీటిని తాకేలా మెట్లనూ నిర్మించబోతున్నారు. భారీ ఫౌంటెన్ నిర్మాణానికి ఆదివారం మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ సహా రాష్ట్ర స్థాయి అధికారులు భూమిపూజ చేశారు.
ప్రపంచంలో మూడో అతిపెద్ద
బాల్ ఆన్ వాల్ ఫౌంటెన్
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద బాల్ ఆన్ వాల్ ఫౌంటెన్‌ను నిర్మించేందుకు మూడు అంశాల ఆధారంగా ప్లాన్ రూపొందించారు.
మొదటిది : వాగు అంచున రోబోటిక్, ఫ్లేమ్ జెట్లు, మధ్యలో వాటర్ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. ఫ్రేమ్ అంచున ఇంటిగ్రేటెడ్ ఆర్జీబీ లెడ్ లైట్లతో సుమారు ఇది 10 మీటర్లతో 2డీ కదిలే రోబోటిక్ జెట్లు ఏర్పాటు చేస్తారు. విభిన్న రంగుల లైటింగ్‌తో బహుళ ఆకృతులను రూపొందించడానికి జెట్లు ఉండనున్నాయి. వావ్ ఎఫెక్ట్‌ని సృష్టించడానికి ఫ్రేమ్‌లో 48 కదిలే హెడ్ లైట్లతో ఓ పేలుడు విసిరేలా భారీ జ్వాల ప్రదర్శించనున్నారు. ఇది కదిలే నీరు, మంటలతో పాటు విభిన్న నమూనాలను ప్రదర్శిస్తుంది. సందర్శకులను అలరించడానికి 40వేల ల్యూమెన్స్ ప్రొజెక్టర్‌ను ఉపయోగించి ప్రత్యేకంగా రూపొందించిన ఫిల్మ్‌ను ప్రొజెక్ట్ చేస్తారు. ఫౌంటెన్, వాటర్ స్క్రీన్ (బాల్ ఆన్ వాల్) ప్రదర్శన సుమారు 10 నుండి 12 నిమిషాల పాటు ఉంటుంది.
రెండోవది : 10మీటర్ల పొడవు.. 30మీ. వెడల్పుగల గోడపై ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఆపైన లామినార్ జెట్లు ఉంటాయి. ఫ్రేమ్ బేస్ వద్ద 30మీటర్ల పొడవు.. 10మీటర్ల ఎత్తు గోడ ఉంటుంది. దానిపై ప్రొజెక్షన్ మ్యాపింగ్ ప్లాన్ చేస్తారు. ప్రొజెక్షన్ మళ్లీ నీటి తెరపై కథను కొనసాగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన 22వేల ల్యూమెన్స్ ప్రొజెక్టర్లను ఏర్పాటు చేస్తారు. కథలో కొంత భాగాన్ని నీటి తెరపైన, కొంత భాగాన్ని దిగువ గోడపై చూపెట్టనున్నారు. షోలో అదనపు ఎలిమెంట్‌గా కిరణాలు, యానిమేషన్లతో లేజర్ షోను రూపొందించడానికి 12 డబ్ల్యూ (ఆర్జీబీ) లేజర్‌ను ఉపయోగించనున్నారు.
మూడోవది: 30మీటర్ల గోడకు ముందు నదిలో 100మీటర్ల ఎత్తు, 30మీ పొడవుతో ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ (బాల్ ఆన్ వాటర్), 10మీటర్ల ఎత్తు 30మీటర్ల పొడవుతో ఫ్లోటింగ్ ఫౌంటెన్‌లో డయా సర్క్యులర్ ఫ్లోటింగ్ ఫౌంటైన్లు ఉంటాయి. సుమారు 12మీటర్ల ఎత్తులో 355 ఛేజింగ్ జెట్లు, 2డి మూవింగ్ రోబోటిక్ జెట్లు, సుమారు 10మీటర్ల ఎత్తులో మరిన్ని జెట్లు ఉండనున్నాయి. ఈ మొత్తం ప్రొగ్రామ్‌లో సంగీతంతోపాటు కదలికలను అభినందించడానికి వాటర్ జెట్లపై యానిమేషన్లతో లేజర్ షో ప్రదర్శించనున్నారు.
ప్రపంచస్థాయి టూరిజం స్పాట్‌గా కరీంనగర్
బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్
మానేరు రివర్ ఫ్రంట్‌కు ఇరువైపులా పార్కులు, వాటర్ ఫౌంటెన్లు, థీమ్‌పార్కులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటెన్స్, ఆటస్థలాలు, గార్డెన్స్ ఇలా అనేక రకాల పర్యాటక అంశాలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫౌంటెన్‌ను ఈ ప్రాజెక్టులో నిర్మించబోతున్నాం. తీగల వంతెనపై నాలుగు భారీ ఎల్ఈడీ తెరలూ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా కరీంనగర్ నిలవనుంది.