Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్, హరీశ్ రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం, దుర్మార్గం అని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు, టీ హరీశ్ రావు వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షపార్టీల పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పి దొంగచాటు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాబలం లేక అధికారంలోకి రాలేక ఈతరహా బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ కుట్రలు దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. దీనికి పరాకాష్టే మనీష్ సిసోడియా అరెస్టు అని చెప్పారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్న తర్వాత ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేక సిసోడియాను ఇప్పుడు అరెస్ట్ చేశారని అన్నారు.
బిజెపి అసమర్థ విధానాలు, అవినీతిని ప్రశ్నిస్తున్న బలమైన పార్టీలను ఎదుర్కోలేక పిరికి రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. బిజెపి తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుని సహౌదరులుగా చూపించి, ప్రతిపక్ష నాయకులను అవినీతిపరులుగా చిత్రీకరించే కుటిల ఎత్తుగడలు వేస్తున్నదని అన్నారు.
బీఆర్ఎస్కు దేశంలో ఆదరణ పెరుగుతుంది-మంత్రి వేముల
ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, అభివద్ధి సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదనీ, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ కూడా పెరుగుతున్నదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గం చౌట్పల్లికి చెందిన బీజేపీ, బీఎస్పీ పార్టీల నుంచి పలువురు కార్యకర్తలు మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సీఎం కేసిఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా కావాలనే డిమాండ్ ప్రజల్లోంచి వస్తోందన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్యస్లో చేరిన అలిండియా ముస్లిం రిజర్వేషన్ సమితి అధ్యక్షుడు
దేశ రాజకీయాల్లో భవిష్యత్తు బీఆర్‌యస్ పార్టీదేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. సూర్యపేట జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత, ఆలిండియా ముస్లిం రిజర్వేషన్ కమిటీ పోరాట సమితి అధ్యక్షుడు యండి ఖాలేద్ అహ్మద్ ఆదివారం మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌యస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణాలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన సరిహద్దు రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.