Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య
- రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కొనసాగిన పాదయాత్ర
నవతెలంగాణ-మహేశ్వరం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 51ని రద్దు చేసి, గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన పాలకుర్తిలో ప్రారంభమైన పాదయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో కొనసాగింది. మహేశ్వరం మండల కేంద్రం నుంచి సిరిగిపురం మీదుగా హర్షగూడ నుంచి తుక్కుగూడ మున్సిపాలిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో చాగంటి వెంకటయ్య మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఏండ్లుగా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నా వారి వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 28న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. పాదయాత్ర 311 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఐటీయూ మహేశ్వరం కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కర్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు, వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతిరెడ్డి, మహేష్, వినోద్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్, సోమయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎన్.రాజు, జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్, జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ జి.కవిత, జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్, రుద్రకుమార్, అల్లి దేవేందర్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.