Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్ష ప్రభుత్వాలను పడకొట్టుడే వారికి తెలుసు : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రధాని మోడీ అదానీకి మాత్రమే దేవుడని, బీజేపీ దేశానికి దరిద్రమని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాశపల్లిలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. రూ.125 కోట్లతో ఎత్తిపోతల పథకాలకు, రూ.10 కోట్లతో నిర్మించనున్న నారాయణగిరి-పీచర డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రూ.25 కోట్లతో నిర్మించిన డబుల్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య అధ్యక్షతన జరిగిన రైతు కృతజ్ఞతా బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి మోడీ దేవుడని చెబుతున్నాడని, ప్రధాని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పాడని, ఇక్కడ ఏ రైతుకైనా రైతు ఆదాయం రెట్టింపు అయ్యిందా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. లేదు.. లేదు అంటూ ప్రజలు స్పందించారు. ఒక్కరి ఆదాయం మాత్రం రెట్టింపయ్యిందని, అదెవరు ? అంటూ కేటీఆర్ ప్రశ్నించగానే ప్రజలు అదానీ అంటూ ప్రతిస్పందించారు. అందుకే మోడీ, అదానీకే దేవుడన్నారు. ఒక్కడిని సంపన్నుడిని చేసి ఆయన నుండి పార్టీ చందాలు తీసుకొని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల ను పడగొడుతున్నారని విమర్శించారు. కరోనా వైరస్ టీకాను మోడీనే కనిపెట్టారని కిషన్‌రెడ్డి ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. మరీ శాస్త్రవేత్తలు ఏం చేసినట్టు అంటూ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజరు మసీదులను తవ్వుతాడంట.. ఈయన్ను మసీదులను తవ్వడానికే ఎంపీని చేసిండ్రా అంటూ ఎద్దేవా చేశారు.
బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఒక్కరి ఖాతాలోనైనా మోడీ చెప్పిన రూ.15 లక్షలు జమయ్యాయా ? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడి, ఐటీ, సీబీఐని వేటకుక్కల్లా ప్రతిపక్ష నేతలపైకి వదిలిందన్నారు. మేం ఎవ్వనయ్యకు భయపడబోమన్నారు. మోడీ వ్యవహారాన్ని దేశ ప్రజలు చూస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై వుందన్నారు.
50 ఏండ్లు అధికారమిస్తే ఏం పీకిండ్రు..
కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అడ్డుక్కుంటుండని, 50 ఏండ్లు అధికారమిస్తే కాంగ్రెస్ పార్టీ ఏం పీకిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని దిక్కుమాలిన పార్టీగా అభివర్ణించారు. రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ఒక కథ చెప్పారు. సోడాశపల్లిలాంటి గ్రామంలో ఒకడు సదువు, సందెలు అబ్బలేదని, మందు తాగుడు, లంగ పనులు చేస్తుండని, 16-17 ఏండ్ల వయస్సుకు వచ్చాక సొంత తండ్రి జేబులో డబ్బులు తీస్తుంటే తల్లి చూసి మందలించి కొట్టడంతో కోపంతో కొడుకు తల్లి తలపై రోకలిబండతో కొట్టాడని, దీంతో తల్లి సచ్చిపోయిందన్నారు. ఇది చూసి కన్నతండ్రి వచ్చి ఏందిరా అట్ల కొట్టినవ్ అని అడిగినందుకు తండ్రి తలపై రోకలిబండతో కొట్టడంతో తండ్రి సచ్చిపోయిండన్నారు. పోలీసులు కేసు పెట్టి కోర్టుకు తీసుకుపోతే దయాకర్‌రావు లాంటి న్యాయమూర్తి, నీలాగా సొంత తల్లిదండ్రులను చంపినోన్ని ఎవ్వరిని చూడలేదంటే .. ఆ పొల్లగాడు.. నేను అమాయకుడ్ని సంపాలని సంపలేదన్నాడంట..రేవంత్‌రెడ్డి మాటలు కూడా గట్లనే సంపినోడే సంతాపం తెలిపినట్టుందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌కు ద్రోహం చేస్తే పాపం అంటుద్దని మంత్రులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు దయాకర్, కవిత, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రీతి మృతిని రాజకీయం..
ఎంజిఎం ఆసుపత్రిలో డాక్టర్ ప్రీతి ర్యాగింగ్‌కు గురై ఆత్మహత్య చేసుకుంటే రాజకీయం చేయడం సమంజసం కాదని కేటీఆర్ అన్నారు. డాక్టర్ ప్రీతి మృతి బాధాకరమంటూ, ఆమె కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతికి కారకులైన వారిని సైఫ్ అయినా, సంజయ్ అయినా వదిలిపెట్టబోమన్నారు.
రాబోయే రోజుల్లో కేటీఆర్ సీఎం : కడియం
రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. సభికుల చప్పట్ల మధ్య మంత్రి కేటీఆర్ లేచి ప్రజలకు అభివాదం చేశారు.