Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ పోలీస్ బలగాల మధ్య మెడికో ప్రీతి అంత్యక్రియలు
- నా కూతురు చావుకు హెచ్ఓడీ, ప్రిన్సిపాలే కారణం : ప్రీతి తండ్రి నరేందర్‌నాయక్
- కొవ్వొత్తులతో పీఎంఎస్ఎస్వై సిబ్బంది ఘన నివాళి
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : ఐద్వా
- ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రీతి మృతి : ఎమ్మెల్యే సీతక్క
- ఎంజీఎం నుంచి కేఎంసీ వరకు ఐద్వా నిరసన
నవతెలంగాణ-కొడకండ్ల/దేవరుప్పుల/మట్టెవాడ/జనగామ
సీనియర్ మెడికో సైఫ్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు సోమవారం భారీ పోలీస్ బలగాల మధ్య జరిగాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని ప్రీతి స్వగ్రామం గిర్నితండాలో ఆమె అంతక్రియలు ముగిశాయి. గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ప్రీతి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం గిర్ని తండాకు సోమవారం ఉదయం తెల్లవారుజామున ప్రీతి భౌతికకాయం చేరుకుంది. ఈ సందర్భంగా జనగామ డీసీపీ సీతారాం, వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలు గిర్ని తండాలో భారీగా మోహరించాయి. ప్రీతి తండ్రి నరేందర్‌నాయక్ అన్ని కష్టాలకోర్చి రైల్వేలో ఏఎస్ఐ ఉద్యోగం సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సురేందర్ నాయక్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెల వివాహం చేశాడు. చిన్న కూతురు, కుమారుడు చదువుల కోసం తన స్వగ్రామమైన గిర్నితండాలో తన వాటాకు వచ్చిన రెండు ఎకరాల భూమిని అమ్మారు. బిడ్డ డాక్టర్ కావాలని సంకల్పంతో డాక్టర్‌ను చేశాడు. కాగా ఆమె మృతితో కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కాగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పలు పార్టీల నాయకులు ప్రీతి కుటుంబాన్ని పరామర్శించి ఘటనకు కారకుడైన సీనియర్ డాక్టర్ సైఫ్‌ను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
నా కూతురు చావుకు హెచ్‌డీఓ ప్రిన్సిపాలే.. కారణం : నరేందర్ నాయక్, ప్రీతి తండ్రి
నా కూతుర్ని డాక్టర్ చేయాలనే సంకల్పంతో స్వగ్రామంలో నాకు వచ్చిన వాటాను అమ్ముకొని ప్రీతిని చదివించాను. ప్రీతి చావుకు ప్రధాన కారణమైన హెచ్ఓడీ ప్రిన్సిపాల్ బాధ్యత వహిస్తూ నా కూతురిని వేధింపులకు గురిచేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను వరంగల్ నడిబొడ్డున ఉరితీయాలి. ప్రీతికి జరిగినట్టు మరో ఆడ కూతురికి అన్యాయం జరగకూడదని, వెంటనే న్యాయ విచారణ జరిపి నిందితునికి కఠిన శిక్ష విధించాలి. మళ్లీ ఇలాంటి సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేసు తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయవిచారణ జరిపి సౖెెఫ్ను ఉరితీయాలి.
కొవ్వొత్తులతో పీఎంఎస్ఎస్వై సిబ్బంది ఘన నివాళి
కేఎంసీలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న డాక్టర్ దారావత్ ప్రీతి మృతి చెందడంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోమవారం హన్మకొండలోని కాకతీయ మెడికల్ కాలేజీ అవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నోడల్ అధికారి డాక్టర్ దుగ్యాల గోపాలరావు ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది ప్రీతి చిత్రపటానికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. కేఎంసి విద్యార్థిని చనిపోవడం అత్యంత దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగవద్దని వారు అన్నారు. అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్లు డాక్టర్ నర్సింగరావు, డాక్టర్ చంద్రశేఖర్, ఆర్‌ఎంఓలు డాక్టర్ హీన, డాక్టర్ కరిష్మా, నర్సింగ్ సూపర్ డెంట్ సుశీల, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : ఐద్వా
మెడికో విద్యార్థి ప్రీతిబాయి మృతి ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపి సైఫ్‌తోపాటు ఉన్న మిగతా వారిని కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులు మల్లు లక్ష్మి, అరుణ జ్యోతి అన్నారు. సోమవారం జనగామ జిల్లా గిర్నితండాలో మెడికో విద్యార్థి ప్రీతి నాయక్ అంత్యక్రియల్లో పాల్గొని ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించి ప్రీతికి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు ప్రీతి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ప్రీతితల్లి పేర్కొందన్నారు. బాధిత కుటుంబానికి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను వెంటనే అమలు చేయాలని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఐద్వా ఉంటుందని అన్నారు. అనేక కళాశాలలో జూనియర్లను సీనియర్లు వేధించడం కొన్ని కళాశాలలో హెచ్ఓడీలు సైతం ఇబ్బంది పెట్టడం మిగతా పనులు చేయించడం సరైంది కాదని అన్నారు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం లాంటి వారి పోరాట స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలని, నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని అన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల హైమావతి, ఆశాలత జిల్లా అధ్యక్షులు ఇర్రి అహల్య తదితరులు పాల్గొన్నారు.
జనగామ, వరంగల్‌లో ఐద్వా నిరసన ర్యాలీ
డాక్టర్ ప్రీతి బారు మతికి కారణమైన డాక్టర్ సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం జనగామ ఆర్టీసీ చౌరస్తా నుండి నూరుపార్క్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు మల్లు లక్ష్మీ, అరుణ జ్యోతి, బత్తుల హైమావతి, ఆశాలత, జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య, జిల్లా కార్యదర్శి ఎండి షబానా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చీర రజిత జిల్లా సహాయ కార్యదర్శి పందిళ్ళ కళ్యాణి, జిల్లా నాయకురాలు బూడిద అంజమ్మ, ఎస్ శిరీష, ఎర్ర అనిత, చంద్రకళ, ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వరంగల్ ఎంజీఎం కూడలి నుండి కేఎంసీ వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన తెలిపిన ఐద్వా నాయకులను పోలీసులు అడ్డుకొని వాగ్విదానికి దిగారు. ఈ క్రమంలో ఇంతేజారుగాంజ్, మిల్స్ కాలనీ సీఐల ఆధ్వర్యంలో వారిని పోలీసులు అరెస్టు చేసి వ్యాన్ లో ఎక్కించి హసన్‌పర్తి పోలిస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంట్టి రత్నమాల ప్రీతి తండ్రి నరేంద్ర తన కూతురిని హత్య చేశాడని మీడియా పరంగా ఆరోపించాడన్నారు. నిజ నిర్ధారణ కోసం విచారణను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా.జిల్లా కమిటీ సభ్యులు మాలోత్ ప్రత్యూష, జిల్లా కమిటీ సభ్యులు భవాని, జ్యోతి, సుజాత, సునీత, వెంకటలక్ష్మి, కవిత, దీప, ఉదయశ్రీ, వాజియా, స్వాతి, రేణుక, తదితరులు పాల్గొన్నారు.
ప్రీతి కుటుంబానికి ఎమ్మెల్యే సీతక్క పరామర్శ
వైద్య విద్యార్థిని ప్రీతి మరణం వైద్య రంగానికి తీరని లోటు అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రీతి కుటుంబాన్ని సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రీతి మృతిచెందిందిందని, రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక హరిజన గిరిజనులపై మర్డర్లు మానభంగాలు హత్యలు ప్రేరేపించడానికి ఈ ప్రభుత్వ చేతగానితనమే అన్నారు. పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ కొడకండ్ల దేవరుప్పుల మండల అధ్యక్షులు సురేష్ నాయక్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ పాలకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ నాయక్ గిన్ని తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు సుధీర్ నాయక్ కార్యకర్తలు మహేష్ భార్గవ్ మహేందర్ హేమాని తదితరులు పాల్గొన్నారు.
ప్రీతిది ముమ్మాటికి హత్యే :జంగా రాఘవరెడ్డి
మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతిది హత్యనే అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. అమ్మాయిలను వేధించే వారి పట్ల కఠినంగా ఉండాలన్నారు. ఇంకో ఆడబిడ్డ పట్ల ఇలాంటి నిర్లక్ష్యం చూపకుండా చూడాలన్నారు. ప్రీతి కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించి బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా పేరుతో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రీతి మృతదేహం గిర్ని తండాకు వచ్చినా మంత్రి దయాకర్ రావు పరామర్శించేందుకు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు. సిట్టింగ్ జడ్జితో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి పది రోజుల్లో నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ లక్ష్మీ నారాయణనాయక్,జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు,పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దరావత్ రాజేష్ నాయక్,కొడకండ్ల, దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షులు దరవత్ సురేష్ నాయక్, పెద్ది కృష్ణమూర్తి, నాయకులు మేడ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.