Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగడ్తాం
- దానికోసం ఐక్య ఉద్యమాలు నిర్మిస్తాం
- 'నవతెలంగాణ' ప్రత్యేక ఇంటర్వ్యూలో టీజీఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్
- మార్చి 1 నుంచి మిర్యాలగూడలో టీజీఎస్ రాష్ట్ర 3వ మహాసభలు
చరిత్రలో ప్రధాని నరేంద్రమోడీ గిరిజన ద్రోహిగా మిగిలిపోతారనీ, ఆయన పాలనలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్ చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు గిరిజన ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామని అన్నారు. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు మిర్యాలగూడలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీరాంనాయక్తో నవతెలంగాణ స్టేట్ బ్యూరో ప్రతినిధి ఎస్ వెంకన్న ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. గిరిజనుల సమస్యలు, పోరాటాలు, సాధించిన విజయాలు సహా అనేక అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి?
శ్రీరాంనాయక్ : కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా గిరిజనులకు తీరని అన్యాయాలు చేసింది. వారి అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు లేవు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమల ఊసే లేదు. దానిపై మోడీ సర్కారు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోగా, 8 ఏండ్లుగా వాటిని పూర్తిగా అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ గిరిజన సంఘం ఆ విషయంలో కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నది. అడవుల్నే ఆధారం చేసుకొని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనులను బలవంతంగా అడవుల నుంచి గెంటేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. కార్పొరేట్లకు అటవీ సంపదను దోచిపెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకు కల్పించిన 1/70, పెసా చట్టాల అమలును నిలిపివేస్తున్నారు. ఇప్పటికే జీవో నెంబర్ 3 రద్దయిపోయింది. నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం వేలాది మంది చెంచు, లంబాడి గిరిజనులను వెళ్లగొట్టేందుకు సిద్ధపడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గిరిజన సంస్కృతి, ఆహార అలవాట్లపై మూక దాడులు చేయిస్తూ, ఆదివాసి గిరిజనులను హత్యలు చేస్తున్నారు. దేశంలో గిరిజన జనాభా 11 శాతానికి పెరిగింది. రిజర్వేషన్లను పెంచకుండా, మరో 15 ఇతర కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ పార్లమెంట్లో చట్ట సవరణ చేశారు. మోడీ హయాంలో అడుగడుగునా గిరిజనులు అన్యాయానికే గురయ్యారు.
రాష్ట్రంలో 11 ఇతర కులాలను ఎస్టీ జాబితాలో కలిపేందుకు నిర్ణయించారు కదా? దానిపై వీ వైఖరి ఏంటి?
శ్రీరాం: తెలంగాణలో ఎస్టీ జాబితాలోకి బీసి కులాలను చేర్చే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. బీసీ జాబితాలోని వాల్మీకి, బోయ, బేదర, కిరాత, మాలి, తలయారి, చుండు వాళ్ళు, కాయితీ లంబాడా, భాట్ మధురాలు, చమర్ మధురాలను ఎస్టీ తెగల జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీన్ని ఉపసంహరించుకోవాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఎస్టీ జాబితాలో ఇతర కులాలను కలిపేందుకు ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడూ అదే జరుగుతున్నది.
మార్చి 1 నుంచి 3వరకు మిర్యాలగూడలో గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నారు కదా! దాని ప్రత్యేకతలు ఏంటి?
శ్రీరాం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తున్నాం. పాలకుల వాగ్దానాల అమలు కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నాం. అనేక నిర్బంధాలు, ఆటంకాల ఎదుర్కొంటూ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా విజయాలు సాధిస్తున్నాం. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 3 వ మహాసభల్లో మన రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి దాదాపు వెయ్యిమందికి పైగా ప్రతినిధులు, మేధావులు, ప్రముఖులు, గిరిజన ఉద్యమకారులు పాల్గొంటున్నారు. గిరిజన సమస్యలు, వాటి సాధన, పోరుబాటపై 25 తీర్మానాలను ఆమోదించబోతున్నాం.
మీ సంఘం గురించి క్లుప్తంగా చెప్పండి...
ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో 1994లో గిరిజన సంఘం ఆలోచన పురుడుపోసుకుంది. 1999 జూలై 30న హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం (రిజిస్టర్ నెంబర్-242/02)గా ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ గిరిజన సంఘం (రిజిస్టర్ నెంబర్-49/2015)గా ఏర్పడింది. గిరిజన సంస్కృతీ పరిరక్షణ, స్వయంపాలన, హక్కులకై పోరాటం వంటివి లక్ష్యాలు. సేవాలాల్, కొమరంభీం, ఠానూ నాయక్, ఏకలవ్య, వాత్యాబీమ్లా, భిక్షా నాయక్, గణేష్ నాయక్ వంటి గిరిజన పోరాట యోధుల స్ఫూర్తితో సంఘం పనిచేస్తున్నది.
ఇప్పటి వరకు మీరు సాధించిన ప్రధాన విజయాలు ఏంటి?
శ్రీరాం : తండాల గ్రామపంచాయతీ సాధన ఉద్యమంలో 1999 నుంచి చురుగ్గా పనిచేశాం. చివరకు విజయం సాధించాం. 2006లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాం. వేలాది మంది గిరిజనులను చైతన్యవంతం చేశాం. చలో హైదరాబాద్, కలెక్టరేట్ల ముట్టడి వంటి ఆందోళనా కార్యక్రమాలతో అప్పటి ప్రభుత్వాలపై ఒత్తిళ్ళు పెంచి, డిమాండ్లు సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ, నిరసనలు, ధర్నాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, చివరకు ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో జారీ చేసేదాకా రాజీలేని పోరాటం చేశాం. రాష్ట్రంలో పెరిగిన గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం 6 నుండి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచాలని జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. స్వతంత్రంగా పోరాటాలు చేస్తూనే ఇతర గిరిజన సంఘాలను కలుపుకొని గిరిజన రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి, ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయడంలో కీలకభూమిక పోషించాం. రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో 2022 సెప్టెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుతూ జీవో నెంబర్ 33ను జారీ చేసింది.
పోడు భూముల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటి?
శ్రీరాం : తరతరాలుగా పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులు, పేదలకు హక్కులు కల్పించాలని వామపక్ష పార్టీలు, తెలంగాణ గిరిజన సంఘం, ప్రజా సంఘాలతో కలిపి సుదీర్ఘ పోరాటలు చేశాం. వాటి ఫలితంగానే రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కులు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే 11.50 లక్షల ఎకరాలపై గిరిజనులకు హక్కు పత్రాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదో పెద్ద విజయం. కానీ క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారులు వేలాది దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. శాటిలైట్ మ్యాప్‌ల పేరుతో దగా చేస్తున్నారు. 75 ఏండ్లుగా పోడు భూములపై ఆధారపడిన వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని చట్టం చెబుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గిరిజనేతరులకు ఇవ్వబోమని చెప్పడం చట్ట విరుద్ధం.
రాబోయే కాలంలో ఎలాంటి సమస్యలపై పోరాటాలు చేస్తారు?
శ్రీరాం : నూతనంగా ఏర్పాటయిన తండాల గ్రామపంచాయతీలకు రెవెన్యూ హౌదా కల్పించాలి. ప్రతి తండాకు కోటి రూపాయలు కేటాయిస్తూ బడ్జెట్ ద్వారా నిధులు ఇవ్వాలి. ప్రత్యేక తండాల అభివద్ధి బోర్డును ఏర్పాటు చేయాలి. మైదాన ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో ఐటీడీఏలు ఏర్పాటు చేయాలి. ట్రై కార్ సంస్థకు ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయించి, బ్యాంకులతో లింకు లేకుండా 90 శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వాలి. గిరిజన బంధు ప్రకటించి 5 నెలలైంది. తక్షణం అమలు చేయాలి. పోడు భూములకు హక్కు పత్రాలు ఉన్న రైతులందరికీ రైతు బంధుతో పాటు బ్యాంకు రుణాలు ఇవ్వాలి. ధరణిలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దాలి. భూమిలేని గిరిజనులకు మూడెకరాల సాగు భూమితో పాటు ఇండ్లు లేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. స్థలాలు ఇంటి స్థలాలు ఉన్న గిరిజనులకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలి. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ప్రభుత్వమే ఇచ్చి రూ.5 లక్షలు ఇవ్వాలి. గిరిజనులకు ఇస్తున్న 100 యూనిట్ల ఉచిత కరెంటును 300 యూనిట్లకు పెంచాలి. ఇలా అనేక డిమాండ్లు సాధించుకోవాల్సి ఉంది. దానికోసం వీటన్నింటిపై మహాసభల్లో తీర్మానాలు పెట్టి చర్చిస్తాం. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం.