Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కదిలి రానున్న సపాయి దండు
- సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు ప్రదర్శన, బహిరంగసభ
- మల్టీపర్పస్ రద్దు, కనీస వేతనాల పెంపు, పర్మినెంట్ కోసం ఉద్యమబాట
- లేబర్కోడ్ల రద్దు కోసం కేంద్రంపైనా పోరు
- పంచాయతీ కార్మికులందరూ కదలిరావాలి : పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర బృందం నేడు(మంగళవారం) హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి చేరుకోనున్నది. అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర బృంద సభ్యులు, పంచాయతీ కార్మికులు ప్రదర్శనగా ఇందిరాపార్కుకు చేరుకోనున్నారు. అక్కడ బహిరంగ సభ జరుగనున్నది. మల్టీపర్పస్ విధానం రద్దు, కనీస వేతనాల పెంపు, పంచాయతీ కార్మికుల పర్మినెంట్, పెండింగ్ వేతనాల బకాయిల చెల్లింపు కోసం, లేబర్కోడ్ల రద్దు డిమాండ్లే ప్రధాన ధ్యేయంగా పాదయాత్ర కొనసాగిన విషయం విదితమే. వాటితోపాటు పచ్చని పల్లెల్లో మతోన్మాద శక్తులకు అవకాశమివొవ్వద్దని చైతన్యపరుస్తూ ముందుకు సాగింది. ఈ పాదయాత్ర బృందానికి తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్ నేతృత్వం వహించగా..ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.పాండు, సీహెచ్. వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.గణపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వినోద్, మహేశ్ బృంద సభ్యులుగా ఉన్నారు. పాదయాత్రను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సొంత నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తిలో ఈ నెల 12న సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు ప్రారంభించారు. 17 రోజుల పాటు 10 నియోజకవర్గాల పరిధిలోని 110 గ్రామపంచాయతీల మీదుగా మంగళవారం పట్నం చేరుకోనున్నది. క్షేత్రస్థాయిలో ప్రధానంగా పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ను, వారి సమస్యలను బృందసభ్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రతిగ్రామంలోనూ తమ దృష్టికి వచ్చిన కీలకాంశాలను నోట్ చేసుకున్నారు. కార్మికుల ఇండ్లకు వెళ్లి వారి దుర్భర జీవితాలను కండ్లార చూసి జ్వలించిపోయారు.
సాదాసీదాగానే..కార్మికుల కోసమే
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారం కోసమే అన్నట్టుగా మూడు పార్టీల నాయకుల పాదయాత్రలు, సభలు జరుగుతున్న సమయంలో... అధికార దాహం కోసం కాకుండా అట్టడుగు సామాజిక తరగతులకు చెందిన పంచాయతీ కార్మికులకు న్యాయం చేయాలంటూ ఈ పాదయాత్ర ముందుకు సాగటం గమనార్హం. 'పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి...వారినీ మనుషులుగా గుర్తించండి...ఇంకా ఈ వెట్టిచాకిరేంటి..మీరు ఐదారు వేల రూపాయలిస్తూ గొప్పలు చెబుతున్నరుగా..మీకు దానికి రెండు రెట్ల జీతం ఇస్తం చేస్తరా?' అంటూ ప్రశ్నిస్తూ సాగిన గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ పాదయాత్ర ప్రతి ఊరిలోనూ ప్రజలను ఆలోచింపజేసింది. పాదయాత్ర అంటే ముందు ఓ యాభై కార్లు... వెనకాల ఓ యాభై కార్లు..నానా హడావిడి, విశ్రాంతి తీసుకునే దగ్గర పెద్దపెద్ద వంటశాలలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశాంత్రిగదులు, మెత్తటి పరుపులు...ఇలా కనిపించే హంగామాలేవీ లేకుండా సాదాసీదాగా సాగిన పాదయాత్ర తీరు ప్రజల మనుసులను మెప్పించింది. తమకు తోచినంత సహాయం చేసేలా ప్రోత్సహించింది. పైసా ఆశించకుండా కార్మికుల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా మేమున్నామంటూ రూపాయి దగ్గర నుంచి వెయ్యి, రెండు వేల రూపాయల వరకు తమకు తోచిన సహాయాన్ని అందించి ప్రజలు తమ ఉదారతను చాటారు.
పంచాయతీ కార్మికులు ఈ సమాజంలో భాగమా? కాదా?
క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్మికుల బతుకులు చూస్తుంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం అనే అనుమానం కలిగింది. వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నరు. 110 పంచాయతీల్లో పర్యటిస్తే 109 గ్రామాల్లో మూడు నుంచి ఏడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఎంత దుర్మార్గం. పంచాయతీల్లో 50 వేల మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు.
రాష్ట్ర సర్కారు జీతాలిస్తున్నది 36,500 మందికి మాత్రమే. దీంతో కార్మికులు వచ్చిన జీతాన్ని పంచుకుని పనిచేస్తున్నారు. ఊరంతా ఆయురారోగ్యాలతో ఉండాలని రేయింబవళ్లు రెక్కలుముక్కలు చేసుకుని పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు సర్కారు ఇచ్చే గౌరవం ఇదేనా? అవార్డులు సర్కారుకు..రోగాలు కార్మికులకా? ఇదేనా పద్ధతి? రోగమొస్తే చూపించుకునేందుకు వాళ్ల చేతుల్లో డబ్బుల్లేక చచ్చిపోతున్నారు. వారికి కనీసం ఈఎస్ఐ, పీఎఫ్, ఇతర రక్షణ సౌకర్యాలు కల్పిస్తే సర్కారు సొమ్మేం పోతున్నది. లక్షలకు లక్షల జీతం తీసుకునేటోళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తున్న పాలకులకు.. మోరీలు తీసేటోళ్లు, రోడ్లు ఊడ్చేటోళ్లు, నీళ్లు పెట్టేటోళ్లు, లైట్లు వేసేటోళ్లకు ఇచ్చేందుకు చేతులు ఎందుకు రావడం లేదు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పర్మినెంట్ చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. కేటగిరీల వారీగా వేతనాలివ్వాలి. అందులో కనీస వేతనం రూ.26 వేలు ఉండాలి. వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ ఉండాలి. పెండింగ్ వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేసేలా రాష్ట్ర సర్కారు ఒత్తిడి తేవాలి. పంచాయతీ కార్మికుల హక్కుల కోసం మేం తలపెట్టిన ఈ పాదయాత్ర ఆరంభం మాత్రమే. మునుముందు పోరాటాన్ని ఉధృతం చేస్తాం. పంచాయతీ కార్మికుల్లారా ఇందిరాపార్కు బహిరంగ సభకు పెద్దఎత్తున కదలిరండి.
- పాలడుగు భాస్కర్