Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతస్థాయి భద్రతా సమావేశంలో సమీక్షించిన డీజీపీ
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి : వచ్చే నెల హైదరాబాద్‌లో 6, 7 తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్న జీ20 దేశాల అంతర్జాతీయ సమావేశానికి భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. సోమవారం డీజీపీ నేతృత్వంలో జీ20 దేశాల గ్లోబల్ కాన్ఫరెన్సు కోసం ఏర్పాటు చేసిన భద్రతా స్థాయి ఏర్పాట్లపై నిశితంగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన పోలీసు ఉన్నతాధికారులతో పాటు ప్రోటోకాల్, ఎన్డీఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐబీ తో పాటు పలువురు సంబంధిత అధికారులు హాజరయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న ఈ గ్లోబల్ సమావేశానికి వివిధ దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు ప్రముఖులు విచ్చేస్తున్న కారణంగా సమావేశం జరిగే హెచ్ఐసీసీలో గతంలో కనీవిని ఎరగని రీతిలో సెక్యూరిటీ ఏర్పాట్లను చేస్తున్నట్టు డీజీపీ చెప్పారు. ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు ప్రత్యేకంగా ఐడెంటీ కార్డులను జారీ చేయడంతో పాటు వారు బస చేసే హోటళ్ల వద్ద కూడా డేగ కండ్లతో సెక్యూరిటీ ఏర్పాట్లను చేస్తున్నట్టు ఆయన వివరించారు.
అలాగే విమానాశ్రయాల వద్ద కూడా సమావేశానికి హాజరు కాబోయే వీఐపీలను ప్రత్యేకంగా వారు బస చేసే హోటళ్లకు తరలించేందుకు సెక్యూరిటీ ఏర్పాట్లను కఠినతరం చేసినట్టు డీజీపీ తెలిపారు. మార్చి 6, 7 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్రాలకు చెందిన సెక్యూరిటీ ఉన్నతాధికారులు, నిఘా అధికారులు సమన్వయంతో పని చేసేలా హెచ్ఐసీసీ వద్ద ప్రత్యేక కమాండ్ కంట్రోల్‌లను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. అలాగే, వీఐపీ లు బస చేసే హోటళ్ల వద్ద కూడా సెక్యూరిటీ కమాండ్ కంట్రోల్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వీటిని సీనియర్ ఐపీఎస్ అధికారి పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజరు కుమార్ జైన్‌తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ పోలీసు అధికారుల హాజరయ్యారు.