Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
పంటలకు తెచ్చిన అప్పుల బాధ తట్టుకోలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం మల్లంపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యులు, కొయ్యుర్ పోలీసుల కథనం ప్రకారం.. అజ్మీరా సేవా నాయక్ (50) అనే రైతు ఈ ఏడాది 3 ఎకరాల మిర్చి, 4 ఎకరాల పత్తి వేశాడు. వేసిన పంటలకు చీడ, పీడలు ఆశించడంతో పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. దాంతో పంటకు తెచ్చిన అప్పు రూ.3 లక్షలు, గతంలో పంటకు తెచ్చిన అప్పు రూ.2 లక్షలు, ఇందుకు తోడుగా తన కూతురు పెళ్లికి తెచ్చిన అప్పు రూ.3లక్షలు మొత్తం రూ.8 లక్షల అప్పు అయింది. ఈ అప్పులు ఎలా తీర్చాలనే మనోవేదనకు గురై ఆదివారం ఉదయం మిర్చి తోట వద్ద పురుగుల మందు తాగాడు. మిర్చి ఎరడానికి వచ్చిన కూలీలు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కొయ్యుర్ ఏఎస్ఐ కుమార స్వామి తెలిపారు. ఆర్థికంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.