Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్రలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్
నవతెలంగాణ-సంతోష్‌నగర్/ చంద్రాయణగుట్ట
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 17వ రోజు హైదరాబాద్ పరిధిలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పాదయాత్రకు జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్మికులు ఘన స్వాగతం పలికి పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు. ఈ పాదయాత్ర సంతోష్ నగర్ చౌరస్తా మీదుగా వీధి బజార్, రిక్షా పురం డీఆర్డిఎల్, బాబా నగర్ చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, జంగంమెట్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ తదితర ప్రాంతాలలో కొనసాగింది. పాదయాత్రకు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ హాజరై మద్దతును ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులకు హైకోర్టు తీర్పు ప్రకారం 24 వేల వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు జె వెంకటేష్ పాదయాత్రకి సంఘీభావాన్ని తెలియజేస్తూ మాట్లాడారు. పాదయాత్ర రథసారధి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 28న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి మున్సిపల్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షురాలు మీనా, జిల్లా కార్యదర్శి ఎం శ్రావణ్ కుమార్ సహకార్యదర్శి ఎస్ కిషన్, ఉపాధ్యక్షులు కోటయ్య, రామ్ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్, మహిళా సంఘం అధ్యక్షురాలు, ఎం లక్ష్మమ్మ, మున్సిపల్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.