Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్ కేఎంసీ పీజీ మెడికల్ విద్యార్థి ప్రీతి మరణం బాధాకరమని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆమె మరణం పట్ల సంతాపం, కుటుంబానికి సానుభూతిని ప్రకటించింది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలనీ, నిందితులను కఠినంగా శిక్షించాలనీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సంపేట జమున ఇంజినీరింగ్ కాలేజీలో ఫొటో మార్ఫింగ్‌తో బ్లాక్మెయిల్ చేసిన ఘటనలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రక్షిత మరణం కూడా దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో రోజురోజుకు ర్యాగింగ్, వేధింపుల ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు శూన్యమని తెలిపారు. దీంతో ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ర్యాగింగ్ నిరోధక కమిటీలు ప్రతి విద్యాసంస్థలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రీతి చదివిన మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారంటూ కొందరు 20 మంది బాధిత విద్యార్థులు ప్రధానికి ట్వీట్ చేస్తే, అది ర్యాగింగ్ కాదంటూ ఆ కాలేజీ యాజమాన్యం ప్రకటించిందని గుర్తు చేశారు.
సైఫ్, హెచ్వోడీలను కఠినంగా శిక్షించాలి : డీవైఎఫ్ఐ
మెడికల్ విద్యార్థి ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ విద్యార్థి సైఫ్, అనస్తీషియా విభాగం హెచ్వోడీలను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ప్రీతి శవమై ఇంటికి తిరిగి రావడం ఆమె తల్లిదండ్రులనే కాకుండా సమాజాన్ని ఎంతో బాధించిందని తెలిపారు. విద్య నేర్పి సమాజానికి గొప్ప విద్యార్థులను అందించాల్సిన విద్యాలయాలు నేడు ర్యాగింగ్ భూతంతో నిండిపోయి వారి చావులకు కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీల్లో ర్యాగింగ్‌ను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లృ పునరావృతం కాకుండా ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి : పీడీఎస్‌యూ
మెడికల్ విద్యార్థి ప్రీతి మరణం పట్ల హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పెద్దింటి రామకృష్ణ, నామాల ఆజాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కేఎంసీ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలిపారు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో జరుగుతున్న ర్యాగింగ్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి : టీపీటీఎఫ్
మెడికల్ విద్యార్థి ప్రీతి మరణానికి దారితీసిన మెడికల్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులు, ర్యాగింగ్ పట్ల మెడికల్ కాలేజీ హెచ్‌వోడీకి, ఆమె తండ్రి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. గిరిజన బిడ్డ కావడం వల్లే ఆ ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఫలితంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. నర్సంపేట ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రీతి, రక్షిత కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించారు.
ప్రీతి మృతికి ప్రభుత్వానిదే బాధ్యత : లిబరేషన్
వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ర్యాగింగ్‌ను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆమె మృతికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.