Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల శ్రమను గౌరవించాలి
- 10,11 తేదీల్లో మండలాల్లో, 14,15 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సభలు : ప్రజాసంఘాల వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనం, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనీ, వారి శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలని పలువురు వక్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 10,11 తేదీల్లో మండల కేంద్రాల్లో, 14,15 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాసంఘాల ప్రెస్మీట్ జరిగింది. అందులో ఐద్వా
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్, ఏఐఏడబ్ల్యూయూ మహిళావింగ్ కన్వీనర్ బొప్పని పద్మ, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మూర్తి, నాగరాజు, ఐద్వా ఉపాధ్యక్షులు ఆశాలత తదితరులు మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం స్కీమ్ వర్కర్లకు గ్రాట్యుటీ చెల్లించాలనీ, వారిని కార్మికులుగా గుర్తించి సామాజిక భద్రత కల్పించాలని కోరారు. మహిళలపై దేశంలో దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మహిళలకు ఉపాధి అవకాశాలను విస్తృత పర్చాలనీ, పనిప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. గృహహింస, కుల దురంహకార హత్యలకు వ్యతిరేకంగా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు ఎమ్ఎస్పీ గ్యారంటీ చట్టాన్ని చేయాలన్నారు.
రైతులు, వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పట్టణప్రాంతాలకూ వర్తింపచేయాలనీ, ఏడాదిలో 200 పనిదినాలు కల్పించి రూ600 కూలి చెల్లించాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ చట్టం-2022ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆదాయపన్ను పరిధిలోకి రాని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.7,500 ఆర్థిక సహాయం చేయాలని కోరారు. మోడీ సర్కారు తెచ్చిన నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.