Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 5న చలో పార్లమెంట్‌ను విజయవంతం చేయాలి
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
- పటాన్చెరులో జీపు యాత్ర ప్రారంభం
నవతెలంగాణ-పటాన్చెరు
'బీజేపీ కో హటావో.. దేశ్ కో బచావో' నినాదంతో ఏప్రిల్ 5న ఢిల్లీ పురవీధుల్లో కదం తొక్కుతూ కార్మిక, కర్షక వర్గం నిర్వహించనున్న చలో పార్లమెంటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్, మతోన్మాద అనుకూల విధానాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఛలో ఢిల్లీ మజ్దూర్, కిసాన్ సంఘర్ష ర్యాలీ జయప్రదం చేయాలని ప్రచార జీపు యాత్రను సోమవారం ప్రారంభించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం చుక్క రాములు మాట్లాడుతూ.. బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా చెప్పడానికి సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీపు యాత్ర చేపట్టినట్టు తెలిపారు. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాలతో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని విమర్శించారు. విదేశీ, స్వదేశీ, బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం, కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తున్నారని, దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆరోపించారు. పేదరికం, నిరుద్యోగం దేశ ప్రజలను పట్టిపీడిస్తున్నాయన్నారు. కార్మిక హక్కులు, కార్మిక చట్టాల రక్షణ, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ కేటాయింపులు, పని దినాల పెంపు, ధరల పెరుగుదలను నియంత్రించడం, రైతు పండించే అన్ని ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించి, కొనుగోలు గ్యారెంటీ చేయాలని, ఒకేసారి కేంద్ర ప్రభుత్వ రుణమాఫీ చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం లాంటి డిమాండ్ల సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక ఉద్యమాలు ఉధృతం చేస్తామని, బీజేపీని గద్దె దించే వరకు ప్రతిఘటన సాగిస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహులు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యాదవ రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, నాయకులు నాగేశ్వరరావు, జార్జ్, వెంకటేష్, రామకృష్ణ, శ్రీనివాస్, గంగాధర్, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.