Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్థం చేసుకోవటమే మల్లు స్వరాజ్యానికి నిజమైన నివాళి
- ప్రథమ వర్ధంతి సభలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్
- స్వరాజ్యమంటే పోరాటం... అదే స్ఫూర్తితో ఉద్యమిద్దాం : ఎస్ పుణ్యవతి
- బతుకంతా పోరాటమే:తెలకపల్లి రవి
- సభలో 'యోధ' పుస్తకావిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రస్తుతం మనదేశం ఎదుర్కోబోయే ప్రమాదం గురించి మాట్లాడటమే మల్లు స్వరాజ్యానికి మనమిచ్చే నిజమైన నివాళి అని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభను ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బి హైమావతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ... స్వరాజ్యం తపన, మాటలు, పోరాట కాంక్ష, ఉద్యమం..ఇలా అన్ని అంశాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. పేదలంతా బాగుండాలని ఆమె కోరుకున్నదనీ, చివరి వరకు ఏ రంగంలో ఉన్నా పోరాటాన్ని కొనసాగించిందని గుర్తుచేశారు. చనిపోయే ముందు కూడా బిగించిన పిడికిలితో పలకరించిందనీ, ఆ పిడికిలి ఒక పోరాట రూపమని గుర్తుచేశారు. స్వరాజ్యం చివరి దశలో సైతం దేశ పరిస్థితుల గురించి ఆందోళన చెందారని తెలిపారు. ఆ పోరాట యోధురాలినే కలవరపాటుకు గురిచేసిన అలాంటి ప్రమాదకర పరిస్థితుల గురించి అందరం మాట్లాడాల్సిందేనన్నారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయుధం చేతబట్టుకుని ఎన్ని పనులు చేశారనే విషయాన్ని ఓ సందర్భంలో తనతో చెప్పారని గుర్తుచేసుకున్నారు. సమాజంలోని అనేక పొరల్లో దాగిన, ప్రజల్ని పీడిస్తున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు స్వరాజ్యం కృషి చేశారని చెప్పారు. ఆమె పోరాట స్ఫూర్తితో దేశం ఎదుర్కొంటున్న ఒక పెద్ద ప్రమాదాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎలాంటి శషబిషలు లేకుండా, మీనమేషాలు లెక్కించకుండా లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఆమె స్ఫూర్తికి న్యాయం చేయాలంటే రాజకీయాల్లో కాలయాపన పనికి రాదని చెప్పారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కమిటి ప్రచురించిన 'యోధ' స్వరాజ్యం యాదిలో అనే పుస్తకాన్ని ఆ సంఘం జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి అవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. స్వరాజ్యానికి మరణం లేదనీ, స్వరాజ్యమంటేనే పోరాటమని చెప్పారు. ఆమె జీవితమే ఒక పోరాట గ్రంథమన్నారు. స్వరాజ్యం యాదిలో ఇప్పుడు మనం ఎలా బతకాలన్నదే పెద్ద ప్రశ్నగా ఉందన్నారు. ఆమె ఏ లక్ష్యం కోసం బతికారో..ఆ లక్ష్య సాధనకోసం ప్రతినబూనాలని చెప్పారు. నాలుగు వేల మంది పోరాట యోధుల అమరత్వంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగితే..ఆ ఎర్రజెండా భిక్షనే నేడు మనం తినే మెతుకులని చెప్పారు. పెత్తనానికి, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి మల్లు స్వరాజ్యమని నివాళులర్పించారు.
మల్లు స్వరాజ్యం ఓ అరుణ తారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు. ఆమెను తలుచుకుంటేనే చైతన్యం ఉరకలెత్తుతుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా సామాజిక పోరాటాలకు ఆమె ప్రతిబింబమని తెలిపారు. ఆమె జీవితమంతా పోరాటమేనని చెప్పారు. స్వరాజ్యం ఒక వికసించిన విద్యుత్తేజమన్నారు. ఆమెను కదలికలో తప్ప స్తబ్దతలో చూడలేమన్నారు. మహిళా చైతన్యానికి ఆమె సజీవ నిర్వచనమని తెలిపారు.స్వరాజ్యం స్వతంత్రురాలని ఐద్వా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి చెప్పారు. ఆమె వ్యక్తికాదు.. ఒక ఉద్యమమన్నారు. సామాజిక ఆర్థిక విషయాలను ఒడిసిపట్టుకోవటంలో శక్తివంతురాలని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన సారా ఉద్యమాన్ని రాష్ట్రమంతా విస్తరించటంలో ఆమె పాత్ర మరవలేనిదన్నారు. ప్రస్తుతం దేశం తిరోగమనవాదుల చేతుల్లో ఉందనీ, దాన్ని కాపాడుకోవాలంటే..స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పెత్తందార్ల దోపిడికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటాలు నిర్వహించిన వీర వనిత మల్లు స్వరాజ్యమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి చెప్పారు. పువ్వు పుట్టగానే పరిమిళించినట్టు ఆమె చిన్న నాటి నుంచే దోపిడి వ్యతిరేక పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పారు. నిత్యం జనంలో ఉండాలని ప్రభోదించేవారని గుర్తుచేశారు. ఆమె స్ఫూర్తితో ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షులు టి జ్యోతి, ఎంవీ ఫౌండేషన్ నాయకులు వెంకటరెడ్డి, పీఓడబ్ల్యు నాయకులు వి. సంధ్య, జి. ఝాన్సి, భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి, సజయ, కపోతం రెడ్డి, కొండపల్లి పవన్, సారంపల్లి మల్లారెడ్డి, మహిళా సమాఖ్య నాయకులు సృజన, కృష్ణబాయి, ఐద్వా అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి, రాష్ట్ర నాయకులు కెఎన్ ఆశాలత, మాచర్ల భారతి, పాలడుగు ప్రభావతి, బుగ్గవీటి సరళ, అరుణోదయ విమలక్క, టీపీఎస్కే కన్వీనర్ హిమబిందు, తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి పశ్యపద్మ, ఇందిర, అనురాధ, శశికళ, వినోద, నాగలక్ష్మి, శాంత, బండి పద్మ తదితరులు ప్రసంగించారు.