Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 9న సీపీఐ, సీపీఐ(ఎం) కీలక ఉమ్మడి సభ
- బీజేపీ అవినీతి పుట్ట..అందులో అన్నీ అవినీతి ఆనకొండలే
- ప్రతిపక్షాలపై వేధింపులకే సీబీఐ,ఈడీ
- గ్రూప్-1లో 90 మార్కులలోపు అర్హుల పరీక్ష రద్దు చేయొద్దు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర వైఫల్యాన్ని ఎండగడుతూ ఈ నెల 25 నుంచి తమ పార్టీ ఆధ్వర్యంలో బయ్యారం నుండి హన్మకొండ వరకు 'సిపిఐ ప్రజా పోరు యాత్ర' పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. దానికి తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు నేతృత్వం వహిస్తారని చెప్పారు. ఏప్రిల్ 9న హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఐ(ఎం) ఉమ్మడి సభ నిర్వహించబోతున్నామనీ, కిందిస్థాయి నుంచి పై స్థాయి నాయకత్వం వరకు కలిపి ఉమ్మడి సభ పెట్టడం ఇదే తొలిసారి అని తెలిపారు. అందులో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, విజయరాఘవన్ పాల్గొంటారని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 5న హన్మకొండలోని కుడా గౌండ్స్‌లో జరిగే ముగింపు సభకు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరవుతారన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, ఖాజీపేటలో రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, ములుగు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు భర్తీ అంశాలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. తొమ్మిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం 7 ఐఐటీలు, 7 ఐఐఎంలు, 16 త్రిపుల్ ఐటీలు, 157 మెడికల్ కాలేజీలు, 50 కేంద్రీయ విద్యాలయాలు, 87 నవోదయ పాఠశాలలు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు.
బీజేపీ అవినీతి పుట్ట అనీ, అది అవినీతి ఆనకొండలకు అడ్డాగా మారిందని కూనంనేని విమర్శించారు. సిసోడియా, కవిత బీజేపీకి లొంగిపోతే వారిపై కేసులు ఉండబోవన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై వేధింపులకే ప్రధాని మోడీ తన అమ్ముల పొదిలోని ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు. చట్టాల ముందు అందరూ సమానులే అని చెబుతున్న బీజేపీ.. ఆదానీ విషయంలో ఎందుకు వాటిని తొక్కిపెడుతున్నదో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, ఆయన కొడుకు జరు షాలపై అనేక అవినీతి కేసులున్నాయనీ, వారందరూ జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు. దేశంలో బీజేపీ వ్యతిరేకించే పార్టీలను ఒక తాటిపై తీసుకొచ్చే పాత్ర పోషిస్తామనీ, ఆ పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రూప్- 1 లో 90 మార్కుల లోపు అర్హులకు పరీక్ష రద్దు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూనంనేని కోరారు. టీఎస్పీఎస్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రజలకు, యువతకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రశ్నపత్రాలు లీకేజీ చేసేవారికి ఐపీసీ 302 తరహాలో శిక్షలు పడేలా కఠిన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ..చరిత్రలో తొలిసారి అధికార బీజేపీ పార్టీనే పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆదానీ వ్యవహారంలో 18 రాజకీయ పార్టీలు ఏకతాటిపై వచ్చి జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తుంటే కేంద్రం పెడచెవిన పెడుతున్నదన్నారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందనీ, జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.