Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయాన్ని నిరీర్యం చేసి కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర
- పత్తి ధరలు పడిపోతున్నా మద్దతు ధర పెంచక చోద్యం
- జనవరి నాటికి అమ్మాల్సింది.. ఏప్రిల్ వస్తున్నా ఇండ్లలోనే సగం పత్తి
- కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కొనసాగుతున్న సీపీఐ(ఎం) జన చైతన్యయాత్రలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి (కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి)
కేంద్రం తీరుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి స్పాట్ పెట్టినట్లుంది. సంస్థ ఆధ్వర్యంలో ఏటేటా పత్తి కొనుగోళ్లు పడిపోతున్నాయి. రెండేండ్ల నుంచి కొన్ని జిల్లాల్లో అస్సలు కొనుగోళ్లే చేయలేదు. ఈ ఏడాది అన్‌సీజన్‌లో ధర తగ్గడంతో సగానికి పైగా నిల్వలు ఇండ్లలోనే ఉన్నాయి. భారత పత్తి సంస్థ (సీసీఐ) రాష్ట్రవ్యాప్తంగా 121 మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి గతేడాది అక్టోబర్ 9వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. 313 జిన్నింగ్ మిల్లులనూ నోటిఫై చేస్తూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. కొనుగోళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా మంత్రి సెలవిచ్చారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా
ఏ ఒక్కచోటా సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించలేదు. గతేడాది ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సెప్టెంబర్ నుంచే పంట దిగుబడి ప్రారంభమైంది. క్వింటాకు రూ.6,380 మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించింది. కానీ సీజన్ ఆరంభంలో బహి రంగ మార్కెట్లో క్వింటాల్ రూ. 8,500 పైగా ధర పలకడంతో సీసీఐ కన్నా ప్రయివేటు ట్రేడర్లు అధిక రేటు చెల్లిస్తుండటాన్ని సాకుగా చూపి కార్పొరేషన్ కొనుగోళ్లు చేపట్టలేదు. సీజన్లోనే ధర ఆశాజనకంగా ఉండటంతో అన్‌సీజన్‌లో ధర ఇంకా పెరుగుతుందనే ఆలోచనతో రైతులు కూడా సరుకు నిల్వ చేసుకున్నారు. కానీ దీనికి భిన్న పరిస్థితి నెలకొన్నా కేంద్రం మాత్రం సీసీఐని రంగంలోకి దించి రైతులను ఆదుకోవ డం లేదు. మద్దతు ధరను సవరించి క్వింటాల్‌కు ఓ రూ.2000 పెంచాలనే ఆలోచన కూడా చేయ ట్లేదు. కార్పొ రేట్ల కోసం ఎన్నో సానుకూల నిర్ణయా లు తీసుకున్నప్పుడు...రైతుల కోసం చిన్న వెసులుబాటు కల్పించాలనే ధోరణి మోడీ ప్రభుత్వానికి లేదని రైతులు, రైతుసంఘాలు విమర్శిస్తున్నాయి.
కేంద్రానికి రైతు శ్రేయస్సుకన్నా.. కార్పొరేట్లే మిన్న
మద్దతు ధరల నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. భారత పత్తి సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థే. ఏటేటా పత్తి విస్తీర్ణం పెరుగు తున్నా.. దిగుబడులు పడిపోతున్నాయి. పెట్టుబడులు పెరుగుతు న్నాయి. ధరలు కూడా క్షీణిస్తున్నాయి. ఎకరానికి 4 నుంచి 8 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తోంది. కేంద్రం అధీనంలోనే ఉండే ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు 10 నుంచి 60శాతం వరకూ పెంచిన దృష్ట్యా పత్తికి మరింత ధర లభించేలా ఎందుకు చర్యలు తీసుకోదూ అనే ప్రశ్నలు ఉత్పన్న మవుతోంది. గతంలో పత్తికి ఎకరానికి రూ.15 నుంచి రూ.20 వేల పెట్టుబడి అయితే ఇప్పుడది రూ.25 వేల నుంచి రూ.30వేలకు చేరింది. ఎకరానికి నాలుగు క్విం టాళ్ల దిగుబడి వచ్చి రూ. 10 వేల ధర పలికినా రైతుకు పత్తి మీద మిగిలేది కేవలం రూ.10వేలే. మరో క్వింటా దిగుబడి తగ్గితే ఆ కొంచెం కూడా లాభం లేకపోగా నష్టపోవాల్సి ఉంటుందని రైతులు వాపోతున్నారు. ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోళ్లలో సీసీఐ భాగస్వామ్యం రెండేండ్లుగా అస్సలు లేదు. సీసీఐ అందుబాటులో ఉన్న 2019-20, 2020-21లో రైతులు సద్వినియోగం చేసుకున్నారు. 2019లో ప్రయివేటుకు 9.22 లక్షల క్వింటాళ్లు అమ్మితే సీసీఐకి 10.07 లక్షలు, 2020లో 2 లక్షలు ప్రయివేటు, 8.07 లక్షలు సీసీఐకి అమ్మారు. ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే పత్తి పండించే ప్రతి మూడిండ్లకు ఓ ఇంట్లో నిల్వలున్నాయి. ప్రతియేటా జనవరి నాటికి పత్తి లేకుండా అమ్ముకునే రైతులు ఈఏడాది మాత్రం ఏప్రిల్ వస్తున్నా పిడికెడు కూడా అమ్మని వారున్నారు. 2022-23లో సోమవారం వరకు 6,53,595 క్వింటాళ్లు మాత్రమే విక్రయించారు. రోజుల తరబడి నిల్వ ఉంచడంతో తూకం తగ్గు తుందని రైతులు వాపోతున్నా రు. ప్రస్తుత మార్కెట్లో గరిష్ఠ ధర రూ.7వేల వరకు లభిస్తోంది. ప్రయివేటు వ్యాపారులు నాణ్యత పేరుతో రూ.5 నుంచి రూ.6వేల లోపే ధర పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనైనా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కేంద్రం చేయట్లేదు.
వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర
ప్రయివేటు ట్రేడర్లకు దీటుగా పత్తి సంస్థ మార్కెట్లో ఉంటే రైతులకు మేలు జరుగుతుంది. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలనే కుట్రలో భాగం గానే కేంద్రం ఇలా వ్యవహరిస్తోంది. వ్యవసాయ చట్టాలను తెచ్చి ఆ కాంక్ష నెర వేర్చుకోవాలనుకుంది. కానీ రైతుల పోరాట ఫలితంగా అది నెరవేరక పోవడంతో వ్యవసాయానికి ఊతం ఇచ్చే సంస్థలు, పథకాలను కేంద్రం నిర్వీర్యం చేసి రైతులను లోబర్చుకోవాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రలు నిర్వహిస్తోంది.
- పోతినేని సుదర్శన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు
తూకం తగ్గుతుంది.. ధర లేదు..
మొత్తం ఐదు ఎకరాల్లో పత్తి వేసి న. మొదట్లో కొన్నిరోజులు ధర బాగుంది. ఇంకా పెరుగుద్దని అనడంతో అప్పుడు అమ్మలే. ఐదునెలల నుంచి అమ్ముదామని చూస్తున్నా. ధర పెరగట్లేదు. రోజురోజుకు పత్తి తూకం తగ్గుతోంది. బేరగాళ్లు వచ్చి అమ్మమంటున్నరు కానీ రూ.6వేల లోపే అడుగుతున్నరు. సీసీఐ నన్న దింపి కొంటరంటే అదీ వచ్చేటట్టు లేదు.
- కొండమీది ఏసు, పమ్మి, ముదిగొండ మండలం