Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనచైతన్య యాత్రలో కేంద్రానికి తమ్మినేని ప్రశ్న
- చాయ్ అమ్మిన బీసీ ప్రధాని ఆ జాతికోసం ఏం చేశారు?
- మనువాద, మతోన్మాద బీజేపీని తిరస్కరించండి
- మనుస్మృతి దగ్ధం చేస్తాం... పాల్గొనే ధైర్యం ఉందా?
- బీజేపీ నేతలకు సవాల్
- యాత్రకు అడుగడుగునా ఘన స్వాగతొం సంఘీభావం తెలిపిన సీపీఐ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలోని బలహీనవర్గాల స్థితిగతుల అధ్యయనం కోసం బీసీ జనగణనను కేంద్రం లోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఎందుకు చేయ ట్లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. బీసీ జనగణన చేయాలని పార్లమెంటులో అన్ని ప్రతిపక్షపార్టీ లు డిమాండ్ చేస్తుంటే, అలాంటి పని తాము చెయ్యబోమని బీజేపీ నేతలు తేల్చిచెప్తున్నారనీ, దీన్నిబట్టే దేశంలోని బలహీనవర్గాల పట్ల ఆపార్టీ వైఖరి స్పష్టమవుతున్నదని అన్నారు. సీపీఐ(ఎం) జనచైతన్యయాత్రలో భాగాం మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్, జూలూ రు పాడులో జరిగిన బహిరంగసభల్లో మాట్లా డారు. అక్కడ నుంచి ఖమ్మంజిల్లా ఏన్కూరు, తల్లాడ మండల కేంద్రాలకు యాత్ర చేరు కుంది. అక్కడ జరిగిన బహిరంగసభల్లో కూడా తమ్మినేని మాట్లాడారు. బీసీ కులంలో పుట్టి, చారు అమ్మి ప్రధానమంత్రి అయ్యాననీ, హిందువులకు ప్రతినిధి అని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ, అదే హిందువుల్లో మెజారిటీ ప్రజలుగా ఉన్న బీసీల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీసీ జనగణన జరిగితే జనాభా దామాషా ప్రకారం తమకు రావల్సిన ప్రయోజనాల కోసం ఎక్కడ నిలదీస్తారో అనే భయం బీజేపీని వెంటాడుతుందని అన్నారు. ఉపాధిహామీ పథకాన్ని పట్టణాలకు విస్తరిం చాలని తాము డిమాండ్ చేస్తుంటే, గ్రామీణం లో ఈ పథకానికి నిధుల్లో కోత విధించారని తెలిపారు. మనువాద, బ్రాహ్మణవాద, మతో న్మాద బీజేపీని ప్రజలు తిరస్కరించాలనీ, మరో సారి ఆపార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశం ఛిన్నాభిన్నం అవుతుందని హెచ్చరించా రు. ఎల్ఐసీ, రైల్వే వంటి ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మేస్తున్నారన్నారు. భూపోరాటంలో గుడిసెలు వేసుకున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇండ్ల పట్టాలు ఇవ్వాలనీ, ఇండ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం వారికి రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థిక నేరగాడు గౌతం అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బందు లు ఏంటని అడిగారు. ఉత్తరాదిలో బీజేపీ బలహీనపడుతున్న విషయం గ్రహించి, ఇప్పుడు దక్షిణాదిపై ఆపార్టీ దృష్టి పెట్టిందనీ, దానికోసం ప్రజల్ని కులమతాల పేరుతో విభజించి, పాలించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నదని చెప్పారు. బీజేపీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ పేరులో సేవ ఉందేతప్ప, ఏనాడూ ఆ సంస్థ ప్రజలకు చేసిందేమీలేదన్నారు. స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీష్‌వారి తొత్తులుగా వారు పనిచేశారంటూ పలు ఉదాహరణలు చెప్పారు. బీజేపీ ఒకే దేశం...ఒకే కులం అని ఎందుకు అనట్లేదని నిలదీశారు. మనుధర్మ శాస్త్రాన్ని తాము అమలు చేయబోమని ఆపార్టీ నేతలు ధైర్యంగా చెప్తే, తల్లాడలో తెల్లారే మనుధర్మశాస్త్ర ప్రతులను దహనం చేసే కార్యక్రమం నిర్వహిస్తామనీ, బీజేపీ నేతలకు దానిలో పాల్గొనే ధైర్యం ఉందా...అని సవాలు విసిరారు. అలాంటి పని బీజేపీ నేతలు చేస్తే, ఆర్ఎస్ఎస్ వారిని అణచివేస్తుందనీ, దాని మూలాలు అక్కడే ఉన్నాయని స్పష్టం చేశారు.
పరిహారం ఇవ్వండి
అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ. 20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని తమ్మినేని డిమాండ్ చేశారు. వడగళ్ల వానతో రాష్ట్రంలో పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందనీ, 'చర్ల'లో మిర్చిరైతులు అధికంగా నష్టపోయారన్నారు. పంటనష్టం అంచనా వేయాలనీ, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వాలని కోరారు.
విచారణ జరపండి
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై సక్రమంగా సమగ్ర విచారణ జరపాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. విచార ణలో దోషులు ఎవరో తేలితే ఆ విషయం ప్రజలకు వెల్లడించాలని చెప్పారు.
సంఘీభావం
సీపీఐ(ఎం) జనచైతన్యయాత్రకు అడుగ డగునా ప్రజల నుంచి స్వాగతం లభించింది. పాల్వంచలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తోపాటు ఆపార్టీ నేతలు యాత్ర బృందాన్ని కలిసి సంఘీభావం తెలి పారు. తమ్మినేని వీరభద్రంతో కూనంనేని మా ట్లాడారు. అలాగే పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ స్థానిక నాయకులు యాత్రకు సంఘీ భావం తెలిపారు. తల్లాడలో జరిగిన బహి రంగ సభలో స్థానిక శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ,సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, పాలడుగు భాస్కర్ పాల్గొని మాట్లాడారు.