Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకకాలంలో మూడు చోట్ల సోదాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. అధికారులు మూడు ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ కొనసాగించారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్ సిట్ కార్యాలయం ముందు మంగళవారం హడావిడి నెలకొంది. బడంగ్పేట్లో ప్రవీణ్, మణికొండలో రాజశేఖర్, రేణుక ఇండ్లల్లో సిట్ అధికారులు మరోసారి తనిఖీలు చేశారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, జగిత్యాలలో మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. మంగళవారం ఉదయం హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి నిందితులను తీసుకొచ్చిన అధికారులు కొద్దిసేపటికే రేణుకతోపాటు ఆమె భర్త ఢాక్యానాయక్ను బయటకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి లంగర్‌హౌస్‌కు వెళ్లారు. ఆ తర్వాత సన్ సిటీలోని కాళీ మందిర్ సమీపంలో ఉన్న వారి స్నేహితులు, బంధువులను ప్రశ్నించారు. అంతేకాకుండా రేణుక సొంతూరు మహబూబ్‌నగర్ జిల్లా గండ్వీడ్‌కు సిట్ బృందం వెళ్లింది. అక్కడ వారి బంధువులను, స్నేహితులను ప్రశ్నించినట్టు తెలిసింది. రాజశేఖర్ సొంతూరు జగిత్యాల జిల్లా తాటిపల్లికి వెళ్లిన మరో బృందం అనుమానితులను విచారించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, మనీ ట్రాన్సాక్షన్స్‌తోపాటు సన్నిహితులు, వారి బంధువులు ఎవరైనా పరీక్షలు రాశారా అనే కోణంలో ఆరా తీసినట్టు తెలిసింది. పరీక్ష రాసిన గోపాల్, నీలేష్‌కు నీలేష్ సోదరుడు రాజేంద్రనాయక్ డబ్బులు సమకూర్చిన విషయంపై ఆరా తీశారు. మేడ్చల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్ శ్రీనివాస్‌కు గోపాల్, నీలేష్‌కు ఎప్పటి నుంచి పరిచయం ఉందన్న కోణంలో విచారించారు. ఈ క్రమంలో పలు కీలక ఆధారాలతోపాటు మరికొన్ని ప్రశ్నాపత్రాలను సేకరించినట్టు సమాచార ం. ఇదిలా ఉండగా లీకేజీ కేసులో కీలక అంశాలు బయటకు రావడంతో ఇంటెలిజెన్స్ పోలీసులు సైతం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిసింది.