Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సవాలక్ష సమస్యల మధ్య ఉగాదికి ఆహ్వానం
- పచ్చడిలో చేదు, వగరు లోటు
నవతెలంగాణ - కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధులు
జీవితమంటేనే కష్ట సుఖాల సమ్మేళనం. తీపి, చేదు, వగరు, పులుపు.. ఇలా జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు ప్రతీకగా నిలిచే ఉగాది పచ్చడితో నూతన తెలుగు సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించడం అలవాటు. సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టే పర్వదినంగా భావించే ఈ పండుగ వేళ కొత్త ఆశలు.. కొంగొత్త ఆశయాలకు అడుగులు వేయాలనుకుంటారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరల మోతతో రాబడి లేక.. ఖర్చేమో భారమై సవాలక్ష సమస్యల మధ్య ఉగాది ఉషస్సు ఏమోగానీ.. బతుకుజీవుడా! అన్నట్టుగా మారింది. షడ్రుచుల పచ్చడిలో ధరల కారమే పండుగ సంబు రాన్ని దూరం చేస్తోంది. ఇంధన ధరలు మొదలుకుని బియ్యం, ఉప్పుపప్పులు, కూర గాయలు ఇలా ఏవి చూసినా కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. వచ్చే కాస్తోకూస్తో రాబడితో ఉగాది పండుగ భోజనమూ కండుపునిండా చేయని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు వ్యవసాయం మీద ఆధారపడుతూ, ప్రకృతిని గమనించుకుంటూ సాగిన కాలంలో ఉగాది పెద్ద పండుగే. ఆకురాలు కాలం ముగిసి వసంత రుతువు మొదలయ్యే సమయం ఇది. వ్యవసాయపరంగా పొలం పనులను ఆరంభించే సమయం ఇది. ఎండిన పొలాన్ని తిరిగి తొలకరికి అనువుగా సిద్ధం చేసుకునేవాళ్లు. ఉగాది పచ్చడిలో కనిపించే షడ్రుచులూ జీవితంలో కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలి అనే సూచనతోపాటుగా ప్రకృతి పరంగా ఆ కాలంలో వేప చిగుళ్లు, మామిడి ముక్కలను ప్రసాదంగా మార్చడం కనిపిస్తోంది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది. ఉగాది పచ్చడిలో వేప పువ్వు చాలా కీలకం. ఆరు రకాల్లో వేప పువ్వు ఒక్కటి. చేదు గుణం కల్గిన వేపపువ్వు పచ్చడికి కమ్మదానాన్ని తీసుకొస్తుంది. ప్రస్తుతం వేప పువ్వు కానరావడం లేదు. కొద్దికాలంగా వేప చేట్లకు వైరస్ సోకి ఎండిపోతున్నాయి. వేప చెట్ల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. దాంతో ఉగాది పచ్చడిలో వేపవుప్వు వెలితి కనిపిస్తోంది. దీనిని కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. పచ్చడిలో మరో కీలకమైన పదార్ధం మామిడి. వగరు రుచిగా మామిడి కాయలు పచ్చడిలో వాడుతారు. అయితే ఇటీవల కురిసిన వడగండ్ల వర్షంతో పెద్ద మొత్తంలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఎలా ఉన్నా ఉన్నదాంట్లో ఉగాది వేడుకలు నిర్వహించేందుకు ప్రజలు సిద్ధం అయ్యారు.
ధరలు ఇలా..
మార్కెట్లో మినపప్పు కిలో రూ. 170, గోధుమ పిండి కిలో రూ. 60కి చేరుకుంది. చింతపండు సాధారణ రకం రూ.100 నుంచి రూ.120, నెంబర్వన్ రకం రూ.200లకు చేరింది. మంచి నూనె ధర వింటే సామాన్యులకు కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. రిఫైన్డ్ ఆయిల్ కిలో రూ.180, మంచి నూనె కిలో రూ.170 నుంచి రూ.190 ధర పలుకుతోంది. పంచదార కిలో రూ.50కి పెరిగింది. ఆరేండ్లలో ఇంత అధికంగా ధరలు పెరిగిన పరిస్థితి చూడలేదని ప్రజలు చెబుతున్నారు. రూ. 100 పట్టుకుని మార్కెట్కు వెళ్తే మూడు రకాల కూరగాయలూ రాని పరిస్థితి నెలకొంది.