Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటిదాకా రూ.4304 కోట్లు విడుదల
- అందులో రూ.3936 కోట్లు వినియోగం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మూడేండ్ల కాలంలో 142 పురపాలికలకు రూ.4304 కోట్లను విడుదల చేసింది. అందులో రూ.3936 కోట్లను( దాదాపు 92 శాతం) పురపాలికలు వినియోగించుకున్నవి. జీహెచ్ఎంసీకి రూ.2276 కోట్లు, మిగిలిన 141 పురపాలికలకు రూ.2028 కోట్ల నిధులు అందాయి. ప్రతినెలా జీహెచ్ఎంసీకి రూ.61 కోట్లు, ఇతర మున్సిపాల్టీలకు రూ.55 కోట్లు విడుదలవుతున్నాయి. వినూత్న ఒరవడితో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేతృత్వంలో చేపట్టిన పట్టణప్రగతితో దేశంలో ప్రామాణిక నగరాలు, పట్టణాలున్న రాష్ట్రంగా ప్రతి యేటా తెలంగాణకు జాతీయ అవార్డులు అందుతున్నాయి.
మున్సిపాల్టీలు ఎక్కువగా పర్యావరణ పరిరక్షణ, శానిటేషన్‌పైన దృష్టిసారించి ముందుకెళ్తున్నాయి. 141 పురపాలక సంస్థల్లో ప్రతిరోజూ 4,356 టన్నుల చెత్తను సేకరిస్తున్నాయి. దాని కోసం కొత్తగా 2165 పారిశుధ్య వాహనాలను కొనుగోలు చేశారు. దీంతో చెత్త సేకరణ వాహనాలు సంఖ్య 4713కి పెరిగింది. చెత్త ప్రాసెసింగ్ కోసం 141 పురపాలక సంస్థల్లో 1233 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్తలను వేరు చేసేందుకు 206 డ్రై సోర్స్ కలెక్షన్ సెంటర్లను సిద్ధం చేశారు. సేంద్రీయ ఎరువులుగా మార్చేందుకు 229 కంపోస్ట్ బెడ్లను నెలకొల్పారు. రూ.428 కోట్లతో రోజుకు 2035 కిలో లీటర్ల సామర్ధ్యం కలిగిన 139 మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 20 పూర్తికాగా..14 తుది దశలో ఉన్నాయి. పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రీన్ యాక్షన్ ప్లాన్‌ను పురపాలక సంస్థల్లో ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్నది. 141 పురపాలక సంస్థల్లోని 3468 వార్డుల్లో పట్టణ ప్రకృతి వనాల కింద ట్రీ పార్క్‌లను అభివృద్ధి చేస్తున్నారు. 2021 నుంచి ఇప్పటి వరకూ 34.59 లక్షల మొక్కలను నాటారు. మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 141 పురపాలికల్లో 796 స్ట్రెచ్‌లలో 1208 కిలోమీటర్లకు పొడవున పలు రకాల మొక్కలు నాటారు. పచ్చదనం పెంపు కోసం రూ.779 కోట్ల నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించారు. హరిత నిధి కింద ట్రేడ్ లైసెన్స్ దారుల నుంచి రూ 128.97 లక్షలు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు నుంచి రూ.14.28 లక్షలు కలిపి మొత్తం రూ. 1.43 కోట్లు జమయ్యాయి. 141 పురపాలక సంస్థలకు 453 శ్మశాన వాటికలు మంజూరు కాగా.. అందులో 297 పూర్తయ్యాయి.