Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రుణ చెల్లింపుల విషయంలో బ్యాంకులు రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవసాయరంగం బలోపేతమైందన్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల సగటులో రాష్ట్రం మొదటి స్థానాన్ని ఆక్రమించిందని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వివరించారు. అందులో భాగంగా పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఆ రైతులకు బ్యాంకులు రుణాలు అందించాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల (ఎస్ఎల్బీసీ) సమావేశంలో మంత్రి మాట్లాడారు. బ్యాంకులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించి, వాటిని స్థాపించడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. వాటి నుంచి ప్రజలకు ఉపాధి కలిగే అవకాశాలపై బ్యాంకులు అధ్యయనం చేయాలన్నారు. ప్రతి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ఇది వరకే దృష్టి పెట్టిందని చెప్పారు.డెయిరీ రంగాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. అందుకుగానూ బ్యాంకులు డైరీ రంగంపై అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా సహకరించాలని తెలిపారు. రుణాలకు సంబంధించి బ్యాంకులు కేవలం పట్టణాల్లోని ఆస్తులు, భూములనే ప్రామాణికంగా తీసుకుంటున్నాయని చెప్పారు. విదేశీ విద్యకు ఉన్న రుణ గరిష్ట పరిమితి రూ.7.5 లక్షలు ఇస్తున్నారనీ, దాన్ని పెంచాలని సూచించారు. నాణ్యమైన వేరుశనగ ఉత్పత్తులకు తెలంగాణ అనువైన ప్రాంతమని, అందులో దక్షిణ తెలంగాణ మరింత అనుకూలమని చెప్పారు. అలాంటి పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. 2022 - 23 సంవత్సరానికి గాను వ్యవసాయ రంగానికి రుణ లక్ష్యంలో బ్యాంకులు చేరుకున్నాయనీ, ఈ రుణాల విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్‌రాస్, ఎస్ఎల్బీసీ అధ్యక్షులు అమిత్ జింగ్రాన్, జీఎం నాబార్డ్ డాక్టర్ వై.హరగోపాల్, ఆర్బీఐ డీజీఎం కేఎస్ చక్రవర్తి పాల్గొన్నారు.