Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా వివిధ రంగాల్లో విశేషమైన కృషిచేసిన 12 మంది ప్రముఖులను ప్రతిభా పురస్కారాలతో సత్కరిస్తున్నది. ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్లోని తమ వర్సిటీలో నిర్వహించే ప్రత్యేక ఉత్సవంలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ భట్టు రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించి ప్రతిభా పురస్కారాలను వివిధ ప్రక్రియల్లో ప్రకటించామని పేర్కొన్నారు. డాక్టర్ వై రామకృష్ణారావు (కవిత), డాక్టర్ లింగంపల్లి రామచంద్ర (విమర్శ), సాజిద్ బిన్ అమర్ (చిత్రలేఖనం), ఎంవి రమణారెడ్డి (శిల్పం), డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి (నృత్యం), ధూళిపాళ శ్రీనివాస్ (సంగీతం), దామెర్ల సాయిబాబ (పత్రికారంగం), బబ్బెళ్లపాటి శ్రీగోపాలకృష్ణసాయి (నాటకం), కిన్నెర బ్రహ్మయ్య (జానపద కళారంగం), డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణశర్మ (అవధానం), డాక్టర్ బండ సరోజన (ఉత్తమ రచయిత్రి), విహారి (నవల/కథ) పురస్కారాలకు ఎంపికయ్యారని వివరించారు. ఒక్కొక్కరికీ రూ.20,116 నగదు అందజేసి సత్కరిస్తామని తెలిపారు.