Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్సుల ఆందోళన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిమ్స్ డైరెక్టర్‌ను మార్చాలంటూ అక్కడి నర్సులు డిమాండ్ చేశారు. నర్సుల పట్ల అరాచకంగా వ్యవహరిస్తూ, వివక్ష ప్రదర్శిస్తున్న నిమ్స్ డైరెక్టర్‌కు వ్యతిరేకంగా నిమ్స్ నర్సెస్ యూనియన్ (ఎన్ఎన్యూ) ఆధ్వర్యంలో మంగళవారం వారు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ లెక్కల ప్రకారం నిమ్స్‌లో 2,300 మంది నర్సులు పని చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 800 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఉన్నవారిలోనూ కేవలం 500 మంది రెగ్యులర్ ప్రాతిపదికన పని చేస్తున్నారని తెలిపారు. దీంతో వారిపై ఒత్తిడి పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలపై డైరెక్టర్ ను కలిసి విన్నవించుకుందామంటే కలవడం లేదని వారు విమర్శించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ లలితకుమారి సమస్యలు లేవనెత్తారనే కోపంతో యూనియన్ ప్రధాన కార్యదర్శి విజయకుమారి, స్లీవలకు మెమోలిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మెమోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమెర్జెన్సీ వార్డుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయని చూపించుకునేందుకు అక్కడి రోగులను జనరల్ వార్డులకు తరలిస్తున్నారనీ, దీంతో నర్సులపై పని భారం పడటమే కాకుండా రోగులకు సదుపాయాలు దొరకడం లేదని చెప్పారు. అర్హత కలిగిన వారికి గ్రేడ్ 1 నర్సింగ్ సూపరిండెంట్‌గా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.