Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్పీసీ ధర్నాలకు సంపూర్ణ మద్దతు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ-కుబేర్ పెండింగ్ బిల్లుల చెల్లింపులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులు, లెక్చరర్ల మూడు నెలల జీతాలు, కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు, పీఆర్సీ బకాయిలు, ప్రావిడెంట్ ఫండ్ రుణాలు, పార్ట్ ఫైనల్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, మైనార్టీ గురుకుల టీచర్ల పీఆర్సీ బకాయిల బిల్లులు ఈ-కుబేర్లో పెండింగ్లో ఉండటం వల్ల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ-కుబేర్లతోని పెండింగ్ బిల్లులను ఈనెల 23వ తేదీలోగా చెల్లించకుంటే 24న జిల్లా ట్రెజరీ కార్యాలయాల ఎదుట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ధర్నా చేస్తామంటూ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సంఘం చేపట్టే ధర్నా చాలా సమంజసమైందని పేర్కొన్నారు. ఆ కార్యక్రమాలకు తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈనెల 23వ తేదీలోగా ఈ-కుబేర్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు. లేదంటే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులందరూ 24న జరిగే ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని గతనెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో తాను ప్రస్తావించానని గుర్తు చేశారు. ఆ తర్వాత రెండు సార్లు లేఖ ద్వారా ఆర్థిక మంత్రి దృష్టికి తెచ్చానని తెలిపారు. అయినా పెండింగ్ బిల్లుల చెల్లింపులు కాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల జాప్యాన్ని నివారించాలని సూచించారు. వెంటనే ఆ బిల్లులను చెల్లించాలని కోరారు.