Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లలో రూ.12,718 కోట్లు చెల్లిస్తామని టీఎస్ఈఆర్సీకి లేఖ
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంటు చార్జీల పెంపు లేదు : ఏఆర్ఆర్ టారిఫ్ ఆర్డర్ ప్రకటించిన చైర్మెన్ శ్రీరంగారావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ వినియోగదారులపై కరెంటు చార్జీల పిడుగు పడలేదు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ప్రస్తుతం అమల్లో ఉన్న టారిఫ్ ఆర్డరే వర్తిస్తుంది. కేవలం ప్రార్థనా మందిరాలకు గతంలో అధికంగా ఉన్న కరెంటు చార్జీలను లోడ్‌తో సంబంధం లేకుండా యూనిట్ సరాసరి ధరను రూ.5 గా నిర్ణయించారు. ఇంతకు మించి వచ్చే ఆర్థిక సంవత్సరం టారిఫ్ ఆర్డర్లో ఎలాంటి మార్పు లేదు. 2022-23లో కరెంటు చార్జీలు పెంచిన విద్యుత్ సంస్థలు 2023-24లో చార్జీల పెంపుపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. దాన్ని యథాతధంగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఈఆర్సీ చైర్మెన్ టీ శ్రీరంగారావు, సభ్యులు ఎమ్డీ మనోహరరాజు (టెక్నికల్), బండారు కృష్ణయ్య ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల ఆదాయ లోటు రూ.10,890.51 కోట్లు ఉంటుందని వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనల్లో (ఏఆర్ఆర్) ప్రతి పాదించాయి. దాన్ని పరిశీలించిన కమిషన్ ఆదాయ లోటు రూ.9,124.82 కోట్లుగా ఉంటుందని నిర్ధారించి ఆమోదించింది. అలాగే విద్యుత్ కొను గోలు ధరను 2022-23లో యూనిట్‌కు రూ.4.49 పైసలుగా నిర్థారిం చగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.4.39 పైసలుగా ప్రకటించారు. కాస్ట్ ఆఫ్ సర్వీస్ కూడా రూ.7.03 పైసల నుంచి రూ.7.02 పైసలుగా నిర్థారించారు. 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.9,124.82 కోట్ల సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. దీనిలో ఎల్టీ-1 కేటగిరి గృహ వినియోగానికి సంబంధించి రూ.1,381.02 కోట్లు, ఎల్టీ-5 కేటగిరిలో వ్యవసాయానికి రూ.9,124.82 కోట్లు సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. దీన్ని టీఎస్ఈఆర్సీ టారిఫ్ ఆర్డర్లో పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ప్రభుత్వ సబ్సిడీ రూ.8,221.17 కోట్లు ఇచ్చింది. దీనికంటే వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రూ.903.65 కోట్లు (11శాతం) అధికంగా సబ్సిడీని ప్రకటించిందని కమిషన్ వెల్లడించింది.
ట్రూ అప్ భారాలు... ప్రభుత్వానికే...
వివిధ పేర్లతో వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీలు వసూలు చేసుకొనేందుకు అనుమతించమని విద్యుత్ పంపిణీ సంస్థలు టీఎస్ఈఆర్సీకి గతంలో దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించిన కమిషన్ ఆ చార్జీలను రూ.12,718.40 కోట్లకు ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని ఐదేండ్లలో దశలవారీగా విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఈఆర్సీకి లేఖ రాసింది. దీనితో ఈ భారం నేరుగా విద్యుత్ వినియోగదారులపై పడలేదు. ఎన్నికల సంవత్సరం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కరెంటు చార్జీలు పెరగకుండా జాగ్రత్త పడింది. 2016-17 నుంచి 2022-23 వరకు మొత్తం ఏడేండ్ల విద్యుత్ కొనుగోలు ట్రూ అప్ రూ.12,514.57 కోట్లకు కమిషన్ ఆమోదం తెలిపింది. అలాగే 2006-07 నుంచి 2018-19 వరకు విద్యుత్ పంపిణీ వ్యాపార వీలింగ్ చార్జీల ట్రూ అప్ పేరుతో డిస్కంలు రూ.4,578.41 కోట్లను క్లెయిం చేశాయి. దీనిలో కూడా ఉదరు స్కీం ద్వారా లభించిన ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని రూ.203.83 కోట్లకు మాత్రమే టీఎస్ఈఆర్సీ ఆమోదం తెలిపింది. మొత్తంగా రూ.12,718.40 కోట్లు ట్రూ అప్ చార్జీలను కమిషన్ ఆమోదించింది. ఈ సొమ్మును ఐదేండ్లలో డిస్కంలకు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌కు లేఖ రాయడంతో దాన్ని పరిగణనలోకి తీసుకొని, వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారాలు వేయలేదని కమిషన్ చైర్మెన్ వివరించారు.