Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతాల పేరుతో చిచ్చుపెట్టడమే బీజేపీ విధానం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జనచైతన్యయాత్రకు నీరాజనం
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
( మెడపట్ల సురేష్)
మోడీపాలన వసూళ్ల రాజ్యంగా తయారైందని మంచిర్యాల నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారే ఇందుకు ఉదాహరణ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు. రోడ్డునిర్మాణం పూర్తికాకముందే వసూళ్లు మొదలు పెట్టారని విమర్శించారు. ఎస్.వీరయ్య నేతృత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగుతున్న జనచైతన్యయాత్ర రెండో రోజు శుక్రవారం నిర్మల్ నుంచి బయలుదేరి ఉట్నూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల మీదుగా కాగజ్‌నగర్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా దారిపొడవునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఈ యాత్రకు ఘన స్వాగతం పలికారు. కాగజ్‌నగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వీరయ్య మాట్లాడారు. మోడీ పాలనలో దేశంలో పేదరికం 23కోట్లకు పెరిగిందని, ఆహార పదార్థాల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయని పేదలు తిండి తినడమే కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంపాదన తిండికే సరిపోవడంలేదని అన్నారు. ధనికుల సంపద పన్ను రద్దు చేసి సాధారణ వ్యాపారులపై జీఎస్టీ భారాలు మోపుతోందని మండిపడ్డారు.
ఆదానీపై సీబీఐ, ఈడీ దాడులు జరగవని, పన్నులు కట్టకపోయినా ఐటీ అధికారులు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి పీఎం పదవి పోతుందనే భయంతో మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకొనే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మోడీ, షాలు కార్పొరేట్ విధానాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మతసామరస్యం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలను కాపాడటం కోసమే సీపీఐ(ఎం) జన చైతన్యయాత్ర చేపట్టిందని వివరించారు. ప్రజలు ఐక్య ఉద్యమాల వైపు నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, జయలక్ష్మీ, స్కైలాబ్‌బాబు, జగదీష్, వెంకటేశ్వర్లు, అడివయ్య, ఆశయ్య, జిల్లా కార్యదర్శి కుశాన రాజన్న పాల్గొన్నారు.