Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేపర్ లీకేజీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
- 19 మంది సాక్షులను విచారించినట్టు వెల్లడి
- ఆ ముగ్గురిని కస్టడీకి ఇవ్వండి : సిట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ కేసులో నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ అధికారులు కీలక అంశాలను చేర్చారు. ఇప్పటివరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది. అందులో నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులుగా తెలిపింది. ఏ-1గా టీఎస్పీఎస్సీ సెక్రెటరీ పీఏ ప్రవీణ్, ఏ-2గా నెట్ వర్క్ అడ్మిన్ రాజశేఖర్, ఏ- 10గా ఏఎస్వో షమీమ్, ఏ-12గా డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజశేఖర్‌లను నిందితులుగా పేర్కొంది. నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులని తెలిపింది. 19 మంది సాక్షులను విచారించినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ అధికారులు పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షిగా పేర్కొన్నారు. శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులుగా పేర్కొంది. కర్మన్‌ఘాట్‌లోని ఒక హౌటల్ యాజమాని, ఉద్యోగిని సైతం సాక్షిగా చేర్చారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్లను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి ఒక ల్యాప్ టాప్, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు.
నాంపల్లి కోర్టులో సిట్ పిటిషన్
టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. గురువారం రమేష్, సురేష్, షమీమ్‌లను సిట్ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముగ్గురిని ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.