Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పార్టీ పాలనలో ఆర్థిక సార్వభౌమత్వం ధ్వంసం
- జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయాలకు గండి
- గతంలో గెలిచిన స్థానాల్లో ఎర్ర జెండా ఎగరేస్తాం : తమ్మినేని వీరభద్రం
- బీజేపీ విధానాల వల్లే ధరల పెరుగుదల : మల్లు లక్ష్మి
- జనచైతన్య యాత్రకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సంఘీభావం
ముదిగొండ నుంచి అచ్చిన ప్రశాంత్
విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి ఒక్కో భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామంటూ చెప్పటం ద్వారా మోడీ గద్దెనెక్కారని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుర్తు చేశారు. ఆ హామీపై ఇప్పుడు బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. గతంలో పన్నుల ద్వారా రాష్ట్రాలకు ఆదాయాలు లభించేవనీ, ఇప్పుడు జీఎస్టీ పేరుతో వాటి ఆదాయాలకు గండి కొట్టి బెదిరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం సరిగా పనిచేసుకోనివ్వడం లేదన్నారు. సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్యయాత్ర ఎనిమిదో రోజైన శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం వి.వెంకటాయపాలెంలో ప్రారంభమై ముదిగొండలో ముగిసింది. జన చైతన్యయాత్రకు ఊరూరా ప్రజలు ఘన స్వాగతం పలికారు. వందలాది మోటార్లు సైకిళ్లు, ఆటోలతో చేపట్టిన ప్రదర్శన యాత్రకు మంచి ఊపు తెచ్చింది. తిరుమలాయపాలెం, కూసుమంచి, తెల్దార్‌పల్లి, ముదిగొండ సభల్లో తమ్మినేని మాట్లాడారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానాల్లో ఒక్కదాన్ని కూడా మోడీ సర్కారు నెరవేర్చలేదని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఎనిమిదిన్నరేండ్ల కాలంలో బీజేపీ సర్కారు మూడు కోట్ల ఉద్యోగాలకు కోతపెట్టిందనీ, తద్వారా కొలువులు కోల్పోయిన వారందర్నీ రోడ్డుపాలుజేసిన తీరును వివరించారు. ఆర్టీసీ, విద్యుత్, రైల్వే, తదితర వ్యవస్థలను కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తున్న బీజేపీ విధానాలను ఎండగట్టారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడేందుకు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తమ్మినేని ఈ సందర్భంగా అన్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు కనీసం రూ.20 వేల మేర నష్టపరిహారం ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌కు సూచించగా రూ.10 వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నారని తెలిపారు. కౌలు రైతులకు కూడా పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌కు కూడా సీఎం అంగీకరిం చారని చెప్పారు. తెల్దార్‌పల్లి గ్రామ ప్రజ లంతా ఐక్యంగా ఉండాలనీ, తద్వారా గ్రామంలో సీపీఐ(ఎం) కు పూర్వవైభవం తేవాలని పిలుపునిచ్చారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ..తెల్దార్‌పల్లి పోరాటాల గడ్డ అనీ, కమ్యూనిస్టు వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి గుజరాత్‌లోని ఏ ఒక్క గ్రామంలోనైనా కనిపిస్తుందా? అని మోడీని ప్రశ్నించారు. ప్రశాంతమైన తెలంగాణను నాశనం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఆ పార్టీని ఎదుర్కోవడానికి అభ్యుదయవాదులంతా ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దళితులను తీవ్రస్థాయిలో అణచివేస్తున్నారని వాపోయారు.
తెల్దార్‌పల్లిలో మాత్రం దళితులు, అన్ని సామాజిక తరగతుల వాళ్లు కలిసికట్టుగా ఉంటున్నారని చెప్పారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ..భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన గడ్డ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వంట గ్యాస్ ధరను మూడు రెట్లు పెంచిన మోడీ సర్కారుకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాల వల్లే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పారు. బీజేపీ ఏలుబడిలో మహిళలపై దాడులు తీవ్రమయ్యాయని తెలిపారు. మహిళలపై వివక్ష చూపుతున్న ఆ పార్టీని గద్దెదింపాలని పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లా సీట్లన్నీ మనవే : ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి
ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సంఘీభావం తెలి పారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరా డుతున్న కమ్యూనిస్టులకు ఆయన ఈ సంద ర్భంగా అభినందనలు చెప్పారు. బీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీట్లన్నీ బీఆర్ఎస్ కూటమికే దక్కుతాన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. 'బావ ఉపేందర్‌రెడ్డి తమ యాత్రకు సంఘీభావం తెల పటం సంతోషకరం...' అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు సీటు సీపీఐ(ఎం)కు కేటాయిస్తే ఉపేందర్‌రెడ్డి మనస్ఫూర్తిగా ప్రచారం చేయాలని కోరారు. ఒకవేళ ఆ సీటును బీఆర్ఎస్కు ఇస్తే ఉపేందర్‌రెడ్డిని దగ్గరుండి గెలిపించు కుంటామని హామీ నిచ్చారు. ముదిగొండలో నిర్వహిం చిన సభలో బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొని యాత్రకు సంఘీభావం తెలి పారు. ఈ సభల్లో పాదయాత్ర బృంద నాయకుడు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం. సాయిబాబుతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.