Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
- ఉపాధ్యాయ అభ్యర్థుల్లో నిరాశ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించి ఏడాది దాటినా ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ), గురుకుల నోటిఫికేషన్లు పత్తా లేకుండా పోయాయి. 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిలో గురుకుల ఉపాధ్యాయ పోస్టులు 12 వేలు, టీఆర్టీ ద్వారా మరో 12 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు వెల్లడించింది. నాలుగు లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు టెట్లో ఉత్తీర్ణత పొంది టీఆర్టీ, గురుకుల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి పది నెలలు దాటింది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం పట్ల అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్టీ, గురుకుల నోటిఫికేషన్లను విడుదల చేయకపోవడం పట్ల తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకోవైపు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. వేసవి సెలవులోనే పూర్తి చేసే అవకాశమున్నది. కానీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థుల మనోవేదనను అర్థం చేసుకుని వెంటనే టీఆర్టీ, గురుకుల నోటిఫికేషన్ల విడుదల చేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.