Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెక్యూరిటీ గార్డు సజీవ దహనం
- అబిడ్స్ పరిధిలో ఘటన
నవతెలంగాణ- సుల్తాన్‌బజార్
హైదరాబాద్ కింగ్ కోఠిలోని కామినేని ఆస్పత్రి పక్కన ఉన్న వినాయక్ ఆటో గ్యారేజ్‌లో అగ్నిప్రమాదం జరిగి కార్వాన్కు చెందిన బి.సంతోష్(42) సజీవదహనం అయ్యాడు. ఈ ఘటనలో మూడు కార్లు పూర్తిగా, నాలుగుకార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతంలోని దుకాణదారులు తెలిపిన వివరాల ప్రకారం.. కామినేని ఆస్పత్రి పక్కన కొన్ని ఏండ్లుగా వినాయక్ ఆటో గ్యారేజ్‌ను బి.వినరు నడుపుతున్నాడు. ఈ గ్యారేజ్‌లో పాత వాహనాలను, పాడైన వాహనాలను రిపేర్ చేస్తుంటారు. దాదాపు 50కుపైగా వాహనాలు ఉన్న ఈ గ్యారేజ్‌లో సెక్యూరిటీగా ఏ టూ జెడ్ కంపెనీకి చెందిన ఇద్దరు వాచ్మెన్లు పనిచేస్తున్నారు. రాత్రి డ్యూటీికి వచ్చిన సంతోష్ శుక్రవారం రాత్రి గ్యారేజ్‌లోని మెర్సిడెజ్ కారులో పడుకున్నాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా గ్యారేజ్‌లో మంటలు చెలరేగి సంతోష్ సజీవ దహనం అయ్యాడు. దట్టంగా చెలరేగిన మంటలతో పరిసర ప్రాంత దుకాణదారులు అబిడ్స్ పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే గౌలిగూడ అగ్నిమాపక కేంద్రం ఫైర్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం బయటపడిన సంతోష్ శవాన్ని అబిడ్స్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సుధాకర్ తెలిపారు.