Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీనిధి కాలేజీలో అధ్యాపకుల ధర్నా
- న్యాయం జరిగే వరకు పోరాటం :టీఎస్టీసీఈఏ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీతాలు చెల్లించాలంటూ ఐదు రోజులుగా ఘట్కేసర్లోని శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో అధ్యాపకులు ధర్నా చేస్తున్నారు. జీతాలివ్వకుంటే పాఠాలను ఎలా బోధించాలని ఆ కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్, కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు. అయినా ఆ కాలేజీ యాజమాన్యం దిగిరాలేదు. అధ్యాపకుల జీతాలిస్తామంటూ ప్రకటిం చలేదు. తెలంగాణ స్కూళ్లు, సాంకేతిక కాలేజీల అధ్యాపకుల సంఘం (టీఎస్టీసీఈఏ) అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. కరోనా పరిస్థితిలో ఉన్న రెండున్నర నెలల జీతం, గతనెల జీతం ఇప్పటి వరకు అధ్యాపకులకు చెల్లించలేదని తెలిపారు. ప్రతి నెల ఏ తేదిన జీతం చెల్లిస్తారో వెల్లడించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. విభజించు పాలించు అనే విధంగా గతనెల జీతం రెండు బ్రాంచీలకే చెల్లించారనీ, మిగతా వారికి చెల్లించడం లేదనీ అధ్యాపకులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ అధ్యాపకులకు సకాలంలో జీతాలివ్వకపోవడం దారుణమని విమర్శించారు. జీతాలు రాక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇంటిఅద్దె, ఈఎంఐ, కుటుంబ పోషణకు ఇతర ఖర్చుల కోసం డబ్బుల్లేక మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. పని చేసిన కాలానికి జీతం ఇవ్వకపోతే వారు ఎలా పాఠం చెప్పటం సాధ్యవుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా శ్రీనిధి కాలేజీ యాజమాన్యం స్పందించి అధ్యాపకులకు నిబంధనల ప్రకారం పూర్తి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరిస్తామంటూ ప్రిన్సిపాల్ హామీఇచ్చారని తెలిపారు.