Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలి
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులతోపాటు వైద్య ఆరోగ్య శాఖ, ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెగ్యులరైజ్ అయ్యేలా ఉత్తర్వులను జారీ చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటూ 2023-24 బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఈనెల 25వ తేదీ ముగిసినా రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు విడుదల కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ పనుల ఒత్తిడిలో ఉండి సీఎం కేసీఆర్ ఈ అంశంపై దృష్టి పెట్టలేదని తెలిపారు. ఆలస్యం అమృతం విషం అన్న నానుడి ముఖ్యమంత్రికి తెలియనిది కాదని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించేందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు తగు ఆదేశాలివ్వాలని కోరారు.