Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ కార్యవర్గంలో నిర్ణయం
- ప్రతి కార్యకర్త పాల్గొనాలి : రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆదివారం గాంధీభవన్ ఆవరణంలోని గాంధీవిగ్రహం వద్ద నిరసన చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ నిరసన దీక్షలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు తప్పకుండా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది అత్యంత కీలకమైన సమయమన్నారు. ఇలాంటి సమయంలో మనం కలిసికట్టుగా పోరాటం చేయాలని కోరారు. రాహుల్‌గాంధీ పై మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. భారత్ జోడో యాత్రతో రాహుల్‌గాంధీ ప్రజలతో మమేకం కావడం, పార్లమెంట్లో ఆదానీ కుంభకోణాలను నిలదీయడంతో బీజేపీ ప్రభుత్వం తట్టుకోలేకపోతున్నదని చెప్పారు. హిండెన్‌బర్గ్ షేర్ల కుంభకోణాన్ని బయటకు తీయడంతోనే కేంద్ర ప్రభుత్వం చర్యలకు పాల్పడిందన్నారు. 2019 కర్నాటకలో రాహుల్‌గాంధీ మాట్లాడిన రాజకీయ ప్రసంగాన్ని ఆసరా చేసుకుని కేసు వేసిందని గుర్తు చేశారు. దొంగల పేర్ల వెనుక మోడీ ఉంటుందన్న అనుమానాన్ని రాహుల్ గాంధీ వ్యక్తం చేశారని తెలిపారు. ఆ కేసు వేసిన వ్యక్తి కూడా తర్వాత కేసు పెండింగ్‌లో పెట్ట మని పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. రాహుల్‌గాంధీకి ప్రజల్లో పలుకుబడి పెరగడంతో కుంభకోణాల సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని చెప్పారు.
ఆదానితో మోడీ వ్యాపారం సంబంధాలు బయటపెట్టాలి : మధుయాష్కీ
అదానీతో మోడీకి ఉన్న వ్యాపార సంబంధాలు ఏంటో బయట పెట్టాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ డిమాండ్ చేశారు. ఎల్ఐసీ, ఎస్బీఐకి ఎంత నష్టం జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ పార్లమెంటులో తప్పుడు ఆరోపణలు చేసిందని విమర్శించారు. స్పీకర్ కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. గుజరాత్లో మోడీ క్యాబినెట్లో శిక్ష పడ్డ వ్యక్తి మంత్రిగా ఎలా కొనసాగారని ప్రశ్నించారు. కోర్టు జడ్జ్మెంట్ సస్పెండ్‌లో ఉండగా స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు వి. హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్, జి. నిరంజన్, వినోద్‌రెడ్డి, సంగిశెట్టి జగదీష్, అజ్మతుల్లా హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ఖర్గేను కలిసి ముఖ్యనేతలు
కర్నాటకలోని ఓ కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి బయలుదేరుతున్న సమయంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జునఖర్గే గంటసేపు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఇతర ముఖ్యనాయకులు ఖర్గేను కలిసిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. ఖర్గేతోపాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ ఉన్నారు. ఇప్పటివరకు 31 నియోజక వర్గాలలో పాదయాత్ర చేసినట్లు ఖర్గేకు రేవంత్ వివరించారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమం బాగా జరుగుతున్నదని తెలిపారు. మోడీ, బీజేపీ చేస్తున్న అప్రజాస్వామిక పాలనపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలని ఈసందర్భంగా ఖర్గే దిశానిర్దేశం చేశారు.
కులగణన చేయాలంటే తప్పా :
బండికి పొన్నం ప్రభాకర్ ప్రశ్న
కుల, జనగణన చేయాలంటూ రాహుల్‌గాంధీ అడిగితే..దానికి బీజేపీ అధ్యక్షులు బండి సంజరు, ఎంపీ లక్ష్మణ్ క్షమాపణ అడగడం సిగ్గు చేటని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణను సుప్రీం కోర్టుకెళ్లి అడ్డుకున్నదని బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. మండల్ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ...కమండలాలు పట్టుకుని ఓబీసీ రిజర్వేషన్లు అడ్డుకుంది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ అనర్హత వేటును నిరసిస్తూ...
కాంగ్రెస్ మహిళా నేతలు బీజేపీ ఆఫీస్ ముట్టడి
రాహుల్‌గాంధీ అనర్హత వేటును నిరసిస్తూ...మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించింది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసిన వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.