Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముచ్చర్ల, కొంగరకలాన్, ఎలిమినేడులో కొత్త పరిశ్రమలు
- మోడీ ఇచ్చిన హామీలేమయ్యారు..?:
- పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరింత సాధికారత సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువైన తీరు, చేపట్టాల్సిన అభివృద్ధిపై చేపట్టిన ప్రగతి నివేదన యాత్రను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి చేపట్టగా.. ముగింపు సభను శనివారం రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్పేట మున్సిపల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రగతి నివేదన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, సాధారణంగా ఇలాంటి పాదయాత్ర ప్రతిపక్ష పార్టీలు చేస్తాయని, కానీ అధికార పార్టీ నుంచి పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే తనయుడు అసలైన ప్రజానాయకుడు ప్రశాంత్ కుమార్రెడ్డి అని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, అందుకు ఎమ్మెల్యే కిషన్రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం 1,24,000 నుంచి మూడు లక్షల 17వేలకు చేరిందని తెలిపారు. పారిశ్రామిక రంగంలో మరింత ముందుకు వెళ్తుందన్నారు. ముచ్చర్ల, కొంగర్ కలాన్, ఎలిమినేడులలో ఫార్మా కంపెనీలు, వాట్స్ కాన్, ఏరోస్పెస్ పరిశ్రమలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయని తెలిపారు. పుట్టిన ప్రతి పిల్లవాడి నుంచి ముసలివారి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదో ఒక లబ్ధి పొందుతున్నారనన్నారు. ఇంటి స్థలం, ఇల్లు లేని నిరుపేదల కోసం గృహలక్ష్మి పథకం ద్వారా మూడు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.నల్లధనం వెలికి తీస్తామని, పేదల అకౌంట్లో డబ్బులు వేస్తామని, 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల్లో మోడీ ఇచ్చిన హామీలు ఏమమయ్యాయని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి తొమ్మిదేండ్లు గడిచినా ప్రజలకు, నిరుద్యోగులకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటూ ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారన్నారు. ఇటీవల లీకైన పరీక్ష పత్రాలు వల్ల విద్యార్థులు నష్టపోవద్దని పరీక్షలను రద్దు చేశామని, దీనిని రాజకీయంగా వాడుకొని లబ్ది పొందడానికి బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఆ పార్టీ నేతలు ధర్నాకు దిగడం సిగ్గుచేటన్నారు.